తెలంగాణ

telangana

ETV Bharat / business

'2027 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​'

గతంలో ప్రవేశ పెట్టిన సంస్కరణలు కారణంగా.. భారతదేశం ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుని.. వృద్ధి దిశగా పయనమైంది. అయితే ఇప్పుడు కూడా మరిన్ని సంస్కరణలు తీసుకువస్తే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి మరెంతో సమయం లేదని కొన్ని అంచనాలు చెప్తున్నాయి.

india third largest economy
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​

By

Published : Nov 9, 2022, 7:44 AM IST

1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ చేపట్టిన సంస్కరణలు.. అప్పటి ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ను గట్టెక్కించడమే కాదు.. ఆ తర్వాత వృద్ధి పరుగులు తీయడానికీ కారణమయ్యాయి. ఇపుడు సరికొత్త సంస్కరణల అజెండాకు సమయం ఆసన్నమైంది. కొవిడ్‌ ముందు స్థాయికి జీడీపీని తీసుకెళ్లడమే కాదు.. అంత కంటే అధిక వృద్ధి సాధించేలా చేయాలి. అది పెద్ద కష్టమేమీ కాదని మోర్గాన్‌ స్టాన్లీ తాజా అంచనాల్లో పేర్కొంది.

  • వచ్చే ఏడేళ్లలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మరో 3 లక్షల కోట్ల డాలర్ల మేర పెరుగుతుంది. 2027 కల్లా ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.
  • భారత జీడీపీ ప్రస్తుత 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి వచ్చే 10 ఏళ్లలో రెట్టింపునకు పైగా పెరిగి 8.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.
  • ఏటా తన జీడీపీకి 400 బిలియన్‌ డాలర్లను భారత్‌ జత చేయొచ్చు. అలా అమెరికా, చైనాలు మాత్రమే చేశాయి.
  • 2032 కల్లా భారత మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి 11 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చు.
  • ఈ అంచనాలన్నీ దేశీయ, అంతర్జాతీయ సానుకూలతలు ఉన్నపుడే సాధ్యమని పేర్కొంది. దేశీయంగా పెట్టుబడులకు, ఉద్యోగ సృష్టికి ఊతమిచ్చేలా విధానాల్లో మరింత మార్పు అవసరమని తెలిపింది.

ఇవీ సానుకూలతలు
'వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ద్వారా దేశీయ విపణిని ఒకే విధానం కిందకు తీసుకొచ్చారు. కార్పొరేట్‌ పన్నుల్లో కోత విధించారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకాల ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇవన్నీ కలిసి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను వేగవంత వృద్ధిని సాధించే దేశంగా తయారు చేస్తున్నాయి. సేవల ఎగుమతుల్లో అధిక అంతర్జాతీయ వాటాను భారత్‌ ఇప్పటికే కలిగి ఉంది. ఈ సానుకూలతల వల్లే కరోనా సమయంలోనూ కార్పొరేట్‌ కంపెనీలు ఇబ్బంది లేకుండా పనిచేయగలిగాయ'ని మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో ప్రస్తావించింది.

భారత్‌, చైనా మధ్య 15 ఏళ్ల అంతరం
ప్రస్తుత భారత జీడీపీ గణాంకాలను చైనా 2007లోనే సాధించింది. అంటే ఇరు దేశాలకు మధ్య 15 ఏళ్ల అంతరం ఉంది. అయితే మరో ఏడేళ్లలో భారత జీడీపీ అదనంగా 3 లక్షల కోట్ల డాలర్లను జత చేసుకోగలదు. 'పనిచేసే వయసు ఉన్న జనాభా భారత్‌లో పెరుగుతున్నందున, దీర్ఘకాల వృద్ధి సాధ్యమవుతుంది. చైనాతో పోలిస్తే భారత పౌరుల సగటు వయసు 11 ఏళ్లు తక్కువ. ఇది కలిసి వస్తుంది. దీని వల్ల భారత వాస్తవ జీడీపీ వృద్ధి రాబోయే పదేళ్లలో సగటున 6.5 శాతం రాణించొచ్చు. ఇదే చైనా విషయంలో 3.6 శాతంగానే ఉండొచ్చ'ని నివేదిక వివరించింది.

మనమే గమ్యస్థానం
గత 30 ఏళ్లలో చైనా వృద్ధికి సహాయపడింది ఆ దేశ పారిశ్రామికీకరణే. రోడ్లు, రైల్వేలు వంటి మౌలిక వసతుల ద్వారానే మంచి వృద్ధి సాధించింది. భారత్‌ ఇపుడు మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆధార్‌ వంటి ప్రజా డిజిటల్‌ మౌలిక వసతులను భారత్‌ నిర్మించింది. తద్వారా వినియోగదార్లు, వ్యాపారుల మధ్య లావాదేవీలు సులభంగానే కాక, సురక్షితంగా సాగుతున్నాయి. ఈ సానుకూలతల వల్ల, రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ వృద్ధిలో అయిదో వంతును భారత్‌ ఒక్కటే సాధించగలదని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. మెరుగైన వృద్ధి కనుచూపు మేరలో కనిపించని ప్రపంచంలో.. బహుళజాతి కంపెనీలకు; అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్‌ ఒక గమ్యస్థానంలా మారగలదని చెబుతోంది.

ABOUT THE AUTHOR

...view details