Software as a service: దేశంలో డిజిటలీకరణ పెరుగుతుండడం వల్ల సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్)కు గిరాకీ ఇప్పటికే బాగా పెరిగింది. రానున్న నాలుగేళ్ల కాలంలో ఈ విభాగంలోని అంకురాలు దాదాపు రూ.7.5లక్షల కోట్లకు (100 బిలియన్ డాలర్లు) పైగా వ్యాపారాన్ని నిర్వహిస్తాయని వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థ చిరాటీ వెంచర్స్, మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సేవల సంస్థ జినోవ్ ఉమ్మడి నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం మూడో సాస్ యూనికార్న్‌ల దేశంగా ఉన్న భారత్ 2026 నాటికి చైనాను అధిగమించి, రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటుందని పేర్కొంది. ప్రభుత్వ విధానాలు, నిపుణుల లభ్యత, పెట్టుబడులు, అంకురాల నుంచి బయటకు రావడానికి ఉన్న అవకాశాలు ఇలా ఎన్నో కారణాలతో సాస్ సంస్థలు వృద్ధిని సాధిస్తాయని పేర్కొంది. 2021లో దేశీయ సాస్ అంకురాల ఆదాయం దాదాపు రూ.60వేల కోట్ల వరకూ ఉంది.
నివేదిక ప్రకారం..:
- ఈ ఏడాది చివరి నాటికి సాస్ కంపెనీల్లోకి రూ.48,750 (6.5 బిలియన్ డాలర్లు) కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. 2021లో వచ్చిన రూ.31,500 కోట్లతో (4.2 బిలియన్ డాలర్లు) పోలిస్తే దాదాపు 55 శాతం అధికంగా ఉండబోతున్నాయి.
- నాలుగేళ్లలో యానికార్న్‌లుగా మారిన సంస్థల్లో 90 శాతం వరకూ సాస్ అంకురాలే ఉన్నాయి. అతి తొందరగా యూనికార్న్‌లుగా మారే సత్తా వీటికి ఉంది.
- గతంలో చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు సేవలను అందించిన సాస్ పరిశ్రమ, ఇప్పుడు ఇంజినీరింగ్, ఉత్పత్తి రంగానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ సేవలనూ అందిస్తోంది.
- 2022లో హైపర్ ఇంటిలిజెన్స్ ఆటోమేషన్, క్లౌడ్ సెక్యూరిటీ, వెబ్3 లాంటి విభాగాల్లో సాస్ సేవలందిస్తోన్న సంస్థలు ఎక్కువగా వెలుగులోకి వస్తాయి.