India Pharmaceutical Exports : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబరులో దేశం నుంచి ఔషధ ఎగుమతులు 14.57 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.20 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. 2021-22 ఇదే కాల ఎగుమతులు 13.98 బి.డా. (సుమారు రూ.1.15 లక్షల కోట్ల) కంటే ఇవి 4.22 శాతం అధికమని తెలిపారు.
భారత్ నుంచి రూ.లక్ష కోట్ల ఔషధ ఎగుమతులు.. గతేడాదితో పోలిస్తే.. - అమెరికాకు ఔషధ ఎగుమతులు
India Pharmaceutical Exports : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబరులో దేశం నుంచి ఔషధ ఎగుమతులు భారీగా పెరిగాయి. గతేడాదిలో పోలిస్తే ఈ ఎగుమతులు 4.22 శాతం అధికమని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 24.62 బి.డా. (సుమారు రూ.2.01 లక్షల కోట్ల) ఔషధాల ఎగుమతి జరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 27 బి.డా. (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు ఎగుమతి చేయగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జులై (-0.32%), అక్టోబరు (-5.45%)లలో ప్రతికూల వృద్ధి నమోదైనా కూడా, రాబోయే నెలల్లో ఔషధ ఎగుమతులు బాగుంటాయనే నమ్మకం ఉందని, అందుకే ఆర్థిక సంవత్సరం మొత్తంమీద సానుకూల వృద్ధి అంచనాలు వేస్తున్నట్లు వివరించారు.
- మొత్తం ఎగుమతుల్లో అమెరికా, కెనడా, మెక్సికో, ఐరోపా, ఆఫ్రికా దేశాల వాటా 67.5 శాతం ఉంటుందని ఉదయ భాస్కర్ చెప్పారు. అయితే వ్యాక్సిన్ల ఎగుమతులు తగ్గినట్లు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ఉన్నా కూడా, ఔషధ ఎగుమతులు పెరుగుతాయన్నదే తమ విశ్వాసంగా చెప్పారు.
- అక్టోబరులో దేశం నుంచి అన్ని రకాల ఎగుమతులు 16.65 శాతం తగ్గి 29.78 బి.డా.కు పరిమితమయ్యాయని వాణిజ్య శాఖ తెలిపింది. ఇందులో భాగమైన ఔషధ ఎగుమతులు 5.45 శాతం తగ్గి, 1.95 బి.డా.కు పరిమితమయ్యాయి.
ఎగుమతులు తగ్గేందుకు..
కొన్ని దేశాల కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బలోపేతం కావడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎదురైన ఆంక్షల వల్లే అక్టోబరులో ఔషధ ఎగుమతులు తగ్గాయని ఉదయభాస్కర్ తెలిపారు. మన దేశం నుంచి ఔషధాలు అధికంగా ఎగుమతి అయ్యే 5 దేశాల్లో నైజీరియా ఒకటి. డాలర్‌తో పోలిస్తే, ఆ దేశ కరెన్సీ నైరా మారకపు విలువ గణనీయంగా తగ్గడంతో, ఆ దేశం దిగుమతులను పరిమితం చేసుకుందని వెల్లడించారు.