తెలంగాణ

telangana

ETV Bharat / business

తిరుగు లేని భారత్​... జీడీపీ వృద్ధిలో మనమే టాప్

India GDP growth UN: భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 2022లో 6.4% నమోదు కావొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. తద్వారా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. ఐరాస ఇంకా ఏం చెప్పిందంటే...

india gdp growth
india gdp growth

By

Published : May 20, 2022, 5:09 AM IST

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ పరిణామాలు ప్రపంచ జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, 2022లో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 6.4 శాతంగా నమోదు కావొచ్చని ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంచనా వేసింది. గతేడాది నమోదైన 8.8 శాతంతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన దేశంగా ఈ ఏడాదీ భారత్‌ కొనసాగుతందని పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నడుమ ప్రైవేటు వినియోగం-పెట్టుబడులపై ప్రభావం ఉన్నప్పటికీ.. వృద్ధి విషయంలో భారత్‌ రాణిస్తోందని పేర్కొంది.

"ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఏర్పడిన పరిస్థితులతో, కరోనా నుంచి పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడింది. ఐరోపాలో సంక్షోభం తలెత్తింది. ఆహార, వస్తువుల ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగానూ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయ"ని బుధవారం విడుదలైన ప్రపంచ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్‌(డబ్ల్యూఈఎస్‌పీ) నివేదికలో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సాంఘిక వ్యవహారాల విభాగం పేర్కొంది. అందులోని విశేషాలు..

  • ఈ ఏడాదిలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 3.1 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. (2022 జనవరి అంచనా 4 శాతం కావడం గమనార్హం.)
  • 2010-20లో నమోదైన సగటు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం 2.9 శాతంతో పోలిస్తే, ఈ ఏడాదిలో రెట్టింపు కంటే పెరిగి 6.7 శాతానికి చేరొచ్చు. ఆహార, ఇంధన ధరల్లో భారీ పెరుగుదల ఇందుకు కారణం.
  • ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇటీవలి కొద్ది నెలల్లో దక్షిణాసియా భవిష్యత్‌ వృద్ధి అంచనాలు తగ్గుతూ వస్తున్నాయి. అధిక కమొడిటీ ధరలకు తోడు, అమెరికాలో కఠిన పరపతి విధాన సమీక్ష వల్ల ఆయా దేశాలపై ప్రతికూల ప్రభావాలు కలగవచ్చన్న అంచనాలున్నాయి. ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 5.5 శాతంగా నమోదు కావొచ్చు. జనవరి అంచనాలతో పోలిస్తే ఇది 0.4 శాతం తక్కువ.
  • భారత్‌ విషయానికొస్తే 2022లో 6.4% (జనవరి అంచనా 6.7%); 2023లో 6 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చు. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లలోనూ వృద్ధి బాటలోనే వెళుతోంది.
  • తూర్పు ఆసియా, దక్షిణాసియా ప్రాంతాలు మినహా ప్రపంచంలోని మిగతా అన్ని ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణ ప్రభావం కనిపిస్తోంది. ఈ విషయంలో భారత్‌ కొంత మెరుగ్గా ఉంది. లాటిన్‌ అమెరికాలోని ఇతర దేశాల్లోలాగా పరపతి విధానాన్ని మరీ కఠినంగా అవలంబించాల్సిన అవసరం లేదు.
  • ఒకట్రెండేళ్లలో భారత రికవరీ బలంగా ఉండొచ్చు. అయితే అంతర్జాతీయ కారణాల వల్ల ఒత్తిడి ఉండదని చెప్పలేం. బలహీన పంట దిగుబడులకు తోడు అధిక ధరల వల్ల భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంకల్లో వ్యవసాయ రంగంపై ప్రభావం పడొచ్చు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details