ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘అంతర్జాతీయ ప్రయాణ, పర్యాటకాభివృద్ధి సూచీ- 2021’లో భారత్ 54వ స్థానంలో నిలిచింది. 2019లో 46వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఎనిమిది స్థానాలు దిగజారడం గమనార్హం. అయితే.. ఇప్పటికీ దక్షిణాసియాలో మొదటి స్థానంలో ఉంది. జపాన్ ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా.. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల ఆర్థిక వ్యవస్థలు, అక్కడి ప్రయాణ, పర్యాటక రంగాల్లో వృద్ధి, భద్రత, ఆరోగ్య పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, సహజ వనరులు, పర్యావరణం తదితర అంశాల ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను రూపొందించింది. రెండేళ్లకోసారి రూపొందించే ఈ అధ్యయనాన్ని 2019 వరకు ‘ప్రయాణ, పర్యాటక పోటీతత్వ సూచీ’ పేరిట విడుదల చేసింది.
పర్యాటకాభివృద్ధి సూచీలో పడిపోయిన భారత్ ర్యాంక్
అంతర్జాతీయ ప్రయాణ, పర్యాటకాభివృద్ధి సూచీలో భారత్ ర్యాంకు 54కు పడిపోయింది. జపాన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి ప్రయాణ, పర్యాటక రంగాలు అందించే సహకారం విలువను కొవిడ్ లాక్‌డౌన్‌లు చాటిచెప్పాయని డబ్ల్యూఈఎఫ్ ట్రావెల్, టూరిజం హెడ్ లారెన్ ఉప్పింక్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మహమ్మారి నుంచి బయటపడిన నేపథ్యంలో.. దశాబ్దాలపాటు నాణ్యమైన ప్రయాణ, పర్యాటక సేవలు అందించేందుకు వీలుగా బలమైన వాతావరణాన్ని నిర్మించడంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రపంచ పర్యాటక సంస్థ వివరాల ప్రకారం కరోనా తర్వాత ఈ రంగంలో పునరుద్ధరణ అసమానంగా ఉంది. జనవరి 2022లో పర్యాటకుల రాక 2019 జనవరితో పోల్చితే 67 శాతం తక్కువగా ఉంది. అయినప్పటికీ.. టీకాల భ్యం, ప్రయాణాలపై ఆసక్తి, దేశీయ, ప్రకృతి పర్యాటకానికి పెరుగుతోన్న డిమాండ్ కారణంగా ఈ రంగం క్రమంగా పుంజుకుంటోందని తెలిపింది.