ఇప్పటిదాకా మీ పర్సు లేదా బీరువాలో ఉన్న నోట్లు ఇక మీ అర చేతిలోని ఫోన్‌లోకి రాబోతున్నాయి. భౌతిక కరెన్సీ డిజిటల్ రూపంలోకి మారబోతోంది. నోట్లు లెక్క పెట్టాల్సిన అవసరం లేకుండా.. ఫోన్‌లో ఒక్క మీట నొక్కడం ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యం లభించబోతోంది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) త్వరలోనే దేశంలో చట్టబద్ధంగా, ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టనున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)తో ఇది సాధ్యం కానుంది.
ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వాడుతున్న భౌతిక కరెన్సీ, త్వరలో వాడుకలోకి రానున్న డిజిటల్ కరెన్సీకి తేడా ఒక్కటే. భౌతిక కరెన్సీ నోట్లను మనం చేత్తో తాకి లెక్కించగలం. డిజిటల్ నోట్లను ఫోన్ ద్వారా వాడగలం. భౌతిక కరెన్సీకి సాంకేతిక రూపమే డిజిటల్ కరెన్సీ. నోట్ల ముద్రణ, విడుదల, పంపిణీలో ఆర్‌బీఐకి పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇది డిజిటల్ కరెన్సీ ఈ పరిధిలోకే వస్తుంది. కాబట్టి, వినియోగదారులకు ఎలాంటి అపోహలకూ తావులేదు. నోట్లు, నాణేల మాదిరిగానే డిజిటల్ కరెన్సీ ఎవరి దగ్గర ఉంటే వారే దాని యజమానులు.
వాడకం ఎలా?
ఉదాహరణకు ఒక వస్తువును రూ.549కి కొనుగోలు చేశారనుకుందాం. ఆ మొత్తానికి సరిపోయే నోట్లనూ, చిల్లరనూ చెల్లిస్తారు. అదే డిజిటల్ కరెన్సీతో ఒకేసారి రూ.549ని బదిలీ చేస్తారు. డిజిటల్ చెల్లింపుల యాప్‌లతో చేసే నగదు బదిలీకి, డిజిటల్ కరెన్సీ లావాదేవీలకు తేడా ఉంది. డిజిటల్ కరెన్సీ లావాదేవీలకు బ్యాంకు ఖాతా, ఇంటర్నెట్ అవసరం లేదు. నోట్లను చెల్లించిన దానికంటే సులభంగా ఫోనులో ఉన్న డిజిటల్ పర్సు నుంచి లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి డిజిటల్ కరెన్సీని నోట్లుగానూ, నోట్లను డిజిటల్ కరెన్సీగానూ ఎలాంటి ఛార్జీలు లేకుండా మార్చుకోవచ్చు.