India Airlines Plane Orders :దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం భారీ ఆర్డర్లు ఇస్తున్నాయి. ఎయిర్ఇండియా, ఇండిగో వంటి కంపెనీలు ఇప్పటికే భారీ స్థాయిలో ఆర్డర్లు ఇవ్వగా- రెండేళ్ల క్రితం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ ఎయిర్ సైతం తన కార్యకలాపాల విస్తరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 150 బోయింగ్ విమానాల కోసం ఆకాశ ఎయిర్ ఆర్డర్లు ఇచ్చింది. ఇందులో బోయింగ్ '737 మ్యాక్స్ 10', బోయింగ్ '737 మ్యాక్స్8-200' విమానాలు ఉండనున్నాయి.
ఆకాశ ఎయిర్‌తో కలిపి ఏడాది వ్యవధిలో భారత్ నుంచి ఇప్పటి వరకు 1120 విమానాల కోసం ఆర్డర్లు వెళ్లినట్లైంది. 2023లో ఎయిర్ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు 970 బోయింగ్, ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిర్ఇండియా మొత్తం 470 ప్లేన్లకు గతేడాది ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇచ్చింది. ఇందులో 250 విమానాలను ఎయిర్‌బస్ నుంచి మరో 220 ఎయిర్‌క్రాఫ్ట్‌లను బోయింగ్ నుంచి సమీకరిస్తోంది. దేశీయ అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగో సైతం గతేడాది జూన్‌లో భారీగా విమానాలకు ఆర్డర్ పెట్టింది. ఎయిర్‌బస్ నుంచి 500 న్యారో-బాడీ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది.
1600 విమానాల డెలివరీ!
వీటితో పాటు, ఈ సంస్థలు ఇదివరకే ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించిన విమానాల డెలివరీ సైతం త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇండిగో సంస్థ మొత్తంగా వెయ్యి వరకు విమానాలకు ఆర్డర్లు ఇచ్చింది. గతేడాది మే నెలలో కార్యకలాపాలు నిలిపివేసిన గో-ఫస్ట్ ఎయిర్‌లైన్ సైతం 72 విమానాలకు గతంలోనే ఆర్డర్ ఇచ్చింది. వచ్చే కొన్నేళ్లలో దేశీయ ఎయిర్‌లైన్ సంస్థలన్నీ కలిపి 1600కు పైగా విమానాల డెలివరీలు స్వీకరించనున్నాయి.