India 5G Services: దేశంలో 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఈనెల 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రిలయన్స్ జియో 4 నగరాల్లో ప్రయోగాత్మక (బీటా) సేవలు అందిస్తున్నట్లు ప్రకటించగా; భారతీ ఎయిర్‌టెల్ 8 నగరాల్లో వాణిజ్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపాయి. వచ్చే ఏడాది కల్లా ఈ సేవలను గణనీయంగా విస్తరిస్తామని ప్రకటించాయి. దేశంలో 10 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఇప్పటికే '5జీ రెడీ' అని ప్రకటితమైన స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు.
అయితే యాపిల్ తాజా ఆవిష్కరణ అయిన ఐఫోన్ 14 సహా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆ సంస్థకు చెందిన 5జీ మోడళ్లు; శాంసంగ్‌కు చెందిన పలు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు కూడా దేశంలో 5జీ సేవలకు అనువైన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెలికాం విభాగ కార్యాలయంలో బుధవారం అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో టెలికాం-ఐటీ కార్యదర్శులతో పాటు యాపిల్, శాంసంగ్, వివో, షియోమీ వంటి మొబైల్ తయారీ కంపెనీల నిర్వాహకులతో పాటు దేశీయ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్ తయారీ సంస్థలు 'ప్రాధాన్యత' ఇవ్వాలని కోరనున్నారు.
- యాపిల్ తన ఐఫోన్లను ఎయిర్‌టెల్, జియో 5జీ నెట్‌వర్క్‌లపై పరీక్షిస్తూ, 5జీ సేవలకు కావాల్సిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రూపొందిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
- శామ్‌సంగ్ ప్రీమియం- కొన్ని మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్లనూ 5జీ కోసమే విడుదల చేసింది. ఈ సంస్థ కూడా తన ఫోన్లకు అప్‌డేట్ ఇవ్వనుంది.
- దేశీయంగా 5జీ డౌన్‌లోడ్ వేగంలో జియో ముందున్నట్లు బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని పరిశోధించే ఓక్లా తెలిపింది. సెకనుకు సగటున 600 మెగాబైట్ వేగం జియో నెట్‌వర్క్‌పై, 515 ఎంబీపీఎస్ వేగం ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌పై లభించినట్లు తెలిపింది.