తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ రిటర్న్స్​ దాఖలుకు జులై 31 ఆఖరు.. ఇలా చేస్తున్నారా మరి? - సుకన్య సమృద్ధి యోజన

it return filing: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ నెల 31 ఆఖరి తేదీ. కొన్నేళ్లుగా రిటర్ను దాఖలులో పలు మార్పులు వచ్చాయి. వెల్లడించాల్సిన ఆదాయాలు, ఖర్చుల వివరాలు పెరిగాయి. ఆదాయపు పన్ను విభాగం వీటన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చి, సులభంగా రిటర్నుల సమర్పణకు అవసరమైన చర్యలనూ తీసుకుంటోంది. ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు పూర్తి చేసేటప్పుడు ఈ కింది జాగ్రత్తలు పాటించండి.

it return
ఆదాయపు పన్ను రిటర్నులు

By

Published : Jul 22, 2022, 8:10 AM IST

it return filing: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం, చెల్లించిన పన్నును అధీకృతం చేయడానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలులో ఎన్నో గణనీయమైన మార్పులు వచ్చాయి. వెల్లడించాల్సిన ఆదాయాలు, ఖర్చుల వివరాలు పెరిగాయి. ఆదాయపు పన్ను విభాగం వీటన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చి, సులభంగా రిటర్నుల సమర్పణకు అవసరమైన చర్యలనూ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ రిటర్నులను సమర్పించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి చిక్కులూ లేకుండా.. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలను పూర్తి చేసేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే..

సరైన పత్రంలో..:ఆదాయపు పన్ను రిటర్నులను ఏ ఫారంలో దాఖలు చేయాలన్నది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. సరైన ఫారాన్ని ఎంచుకోకపోతే.. రిటర్నులను ఆదాయపు పన్ను శాఖ ఆమోదించకపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా మన ప్రయత్నం వృథా అవుతుంది. మీకు వచ్చిన ఆదాయం, ఆదాయ మార్గం, పెట్టుబడులు, ఒకటికి మించి ఇళ్లు.. ఇలా సందర్భాన్ని బట్టి రిటర్నుల ఫారాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా వేతనం తప్ప మిగతా ఆదాయాలు లేని వారు, ఒక ఇంటి నుంచి ఆదాయం ఉన్నవారికి ఐటీఆర్‌-1 సరిపోతుంది. ఈక్విటీల్లో పెట్టుబడుల వల్ల మూలధన లాభం/నష్టం ఉన్నవారు, ఇతర వృత్తి, వ్యాపార ఆదాయాలు ఉన్నవారు ఐటీఆర్‌-2ను ఎంచుకోవాలి. షేర్లలో ఇంట్రాడే లేదా ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్‌ లావాదేవీలు నిర్వహించిన వారు ఐటీఆర్‌-3లో రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

వ్యక్తిగత వివరాలు..:ప్రస్తుత అసెస్‌మెంట్‌ ఇయర్‌ అంటే.. 2022-23 (ఆర్థిక సంవత్సరం 2021-22)కు గాను ఆదాయపు పన్ను శాఖ ముందే దాదాపు 90 శాతానికి పైగా నింపిన ఐటీఆర్‌ ఫారాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫారాన్ని ఒకసారి చూసుకోవడంతోపాటు, వ్యక్తిగత వివరాలు అంటే.. మీ పేరు, చిరునామా, ఫోన్‌, ఇ-మెయిల్‌ అన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. మార్పులుంటే.. ఐటీఆర్‌ ఫారంలో కాకుండా.. పోర్టల్‌లోని అప్‌డేట్‌ విభాగానికి వెళ్లి, అక్కడ ఆ వివరాలను నమోదు చేయండి.

పోల్చి చూసుకోండి..:పన్ను గణనలో పారదర్శకతను పెంచేందుకు ఆదాయపు పన్ను శాఖ ఫారం 26 ఏఎస్‌తో పాటు, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)ను అందిస్తోంది. ఈ రెండింటినీ ఒకసారి పోల్చి చూసుకోండి. ఈ రెండింటి ఆధారంగానే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటే.. ఏఐఎస్‌పై మీ ఫిర్యాదును పన్ను విభాగానికి తెలియజేసేందుకు వీలుంది. పొరపాట్లను సరిచేసుకోకుండా, దానికి సంబంధించి ఫిర్యాదు చేయకుండా రిటర్నులు వేస్తే.. తర్వాత చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

దాపరికం వద్దు..:అరుదుగా మీ ఆదాయ వివరాలు ఏఐఎస్‌లో నమోదు కాకపోవచ్చు. అంతమాత్రాన వాటి గురించి పన్ను విభాగానికి తెలియదని కాదు. మీ ఆదాయాలను నమోదు చేసే విషయంలో పూర్తి పారదర్శకత పాటించండి. ముఖ్యంగా ఆస్తుల క్రయవిక్రయాలు, విదేశాల నుంచి వచ్చిన ఆదాయం, ఏదైనా కంపెనీలో డైరెక్టర్‌గా ఉండటం, స్టాక్‌ మార్కెట్లో నమోదు కాని అన్‌లిస్టింగ్‌ షేర్ల లావాదేవీల్లాంటివి తెలియజేయాల్సి ఉంటుంది.

మినహాయింపు ఆదాయం..:కొన్ని ఆదాయాలకు పన్ను వర్తించదు. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన తదితరాలపై వచ్చిన వడ్డీ, బంధువుల నుంచి నిబంధనల మేరకు వచ్చిన బహుమతులు పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తాయి. అయితే, వీటిని రిటర్నుల సమయంలో నమోదు చేయడం మర్చిపోవద్దు.

రూ.లక్ష దాటితే..:ఆదాయపు పన్ను రిటర్నుల విషయంలో ప్రభుత్వం ఇటీవల పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రూ.2లక్షలకు మించి విదేశీ ప్రయాణాల కోసం ఖర్చు చేసిన వారు, ఇంటి విద్యుత్‌ బిల్లు ఏడాదిలో రూ.లక్ష దాటిన వారు, విదేశాల్లో ఆస్తులు ఉన్నప్పుడు, బ్యాంకు డిపాజిట్లలో రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడు, టీడీఎస్‌ లేదా టీసీఎస్‌ రూ.25,000 మించితే.. తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. ఆదాయం పన్ను పరిమితి లోపున్నప్పటికీ వీరందరూ రిటర్నులు సమర్పించాలి.

చివరగా.. రిటర్నులు సమర్పించగానే సరిపోదు. వాటిని కచ్చితంగా ఇ-వెరిఫై చేసినప్పుడే ఆ ప్రక్రియ పూర్తయినట్లు. ఆధార్‌ ఓటీపీతో దీన్ని సులభంగానే చేయొచ్చు. లేదా సీపీసీ బెంగళూరుకు ఐటీఆర్‌-5ను పంపించొచ్చు. దీనికన్నా ఇ-వెరిఫై చేయడమే మేలు.

ఖాతా వివరాల్లో తప్పులు..:రిఫండును కోరే పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంకు వివరాలను సరిగ్గా నమోదు చేయాల్సి ఉంటుంది. పాన్‌ కార్డులో ఉన్న పేరు, బ్యాంకు ఖాతాలో ఉన్న పేరులో తేడాలుంటే.. రిఫండును జమ చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. బ్యాంకు ఖాతాను ముందుగానే వెరిఫై చేయడం మేలు.

ఇవీ చదవండి:డ్రైవర్‌ లేని ఎలక్ట్రిక్​ కారు.. ధర ఎంతో తెలుసా?

ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ@4 .. బిల్​గేట్స్​ను​ వెనక్కినెట్టి

ABOUT THE AUTHOR

...view details