తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ రిటర్న్స్​ దాఖలు ఎందుకో తెలుసా?.. గడువులోపు కట్టకపోతే నష్టాలివే! - ఐటీ రిటర్నులకు ఆఖరి గడువు

Income Tax Return Filing : మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చారా? మీ సంస్థ మీ వేతనం నుంచి మూలం వద్ద పన్ను (టీడీఎస్‌) మినహాయించిందా? అయితే మీరు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసుకోండి. చాలామందిలో ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోతే ఏమవుతుంది? అనే సందేహం ఉంటుంది. అలాంటి సందేహాలకు సమాధానాలివే..

it return filing
it return filing

By

Published : May 22, 2023, 9:24 AM IST

Income Tax Return Filing : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులు దాఖలు చేసేందుకు సమయం దగ్గర పడుతోంది. సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ జులై 31 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు పెడుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గడువు పొడిగించే అవకాశం ఉండొచ్చు. కానీ.. తప్పనిసరేమీ కాదు. ఈ నేపథ్యంలో జులై 31 లోపే రిటర్నులు పూర్తి చేసేయడం ఉత్తమం. గడువులోపు ఐటీ రిటర్నులు దాఖలు చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

రిఫండు కోసం..:
మీకు మూలం(టీడీఎస్​) వద్ద పన్ను కోత అధికంగా ఉందనుకోండి.. నిబంధనల మేరకు ఆ మొత్తాన్ని రిఫండు రూపంలో పొందేందుకు అవకాశం ఉంటుంది. రిటర్నులను గడువులోపే దాఖలు చేస్తే, వడ్డీ సహా ఆదాయపు పన్ను శాఖ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఒకవేళ మీరు పన్ను చెల్లించాల్సి ఉండి, గడువు తేదీని మీరితే.. వడ్డీతోపాటు, జరిమానా వర్తిస్తుంది.

రుణాలు తీసుకునేందుకు:
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను ఇచ్చేందుకు కనీసం మూడేళ్ల ఫారం-16, పన్ను రిటర్నులను ఆదాయానికి ఆధారాలుగా అడుగుతాయి. కాబట్టి.. ఏటా తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు రిటర్నులు సమర్పించాలి. రిటర్నులు లేకపోతే గృహ రుణం లాంటివి తీసుకోవడం కష్టం అవుతుంది.

వీసా కావాలన్నా:
అమెరికా, తదితర దేశాలకు వీసా కావాలనుకుంటే.. ఆదాయపు పన్ను రిటర్నులను అడిగే అవకాశం ఉంది. మీ ఆదాయానికి ధ్రువీకరణగా రిటర్నులు పనికొస్తుంది. వీసా దరఖాస్తుతోపాటు రిటర్నులు తప్పనిసరేం కాదు. కాకపోతే.. సులభంగా వీసా వచ్చేందుకు వీలుంటుంది.

నష్టాల సర్దుబాటు:
ఆస్తులు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు విక్రయించడం ద్వారా వచ్చిన దీర్ఘకాలిక మూలధన నష్టాలను భవిష్యత్తులో వచ్చే.. దీర్ఘకాలిక మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. దీని కోసం కచ్చితంగా ఆఖరి గడువు తేదీ లోపు రిటర్నులు దాఖలు చేయాలి. ఒక వేళ పన్ను వర్తించే ఆదాయం లేకపోయినా, పైన పేర్కొన్న నష్టాలు ఉన్నప్పుడు రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది.

గడువు తేదీ దాటితే:
గడువు తేదీ దాటిన తర్వాతా ఐటీ రిటర్నులు దాఖలు చేయవచ్చు. కానీ, దీనికోసం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.1,000, అంతకు మించి ఉన్నప్పుడు రూ.5,000 వరకూ అపరాధ రుసుం విధిస్తారు. డిసెంబరు 31 తర్వాత ఈ మొత్తం రూ.10వేలు ఉంటుంది.
వీలైనంత వరకూ గడువు పూర్తి కాకముందే వర్తించే ఐటీ ఫారంలో రిటర్నులు దాఖలు చేయడం మేలు. తొందరగా రిఫండ్‌ రావడం సహా, ఏదైనా పొరపాటు చేసినా, మళ్లీ రివైజ్డ్‌ రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details