వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు ఈ నెలాఖరులోగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. కంపెనీలు, సంస్థల్లో పనిచేసే భాగస్వాముల వంటి పన్ను చెల్లింపుదారుల ఆదాయపు ఖాతాలను ఆడిట్ చేయాల్సి ఉంటుంది గనక వారికి అక్టోబరు 31 వరకు గడువు ఉంది. గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేస్తే ఎలాంటి జరిమానాలు, న్యాయపరమైన చిక్కులు ఉండవు. సకాలంలో ఐటీఆర్ దాఖలు చేస్తే ఉన్న ప్రయోజనాలేంటో చూద్దాం..
నష్టాల బదిలీ: కొన్ని రకాల పెట్టుబడులపై నష్టాలు వాటిల్లితే వాటిని వచ్చే ఏడాది సమర్పించబోయే ఐటీఆర్‌లో చూపించేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా పన్ను ప్రయోజనాలు పొంది కొంత ఆదా చేసుకోవచ్చు. అయితే, గడువులోగా ఐటీఆర్ దాఖలు చేసిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది.
న్యాయపరమైన చిక్కులకు దూరం: ఒకవేళ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు అందే అవకాశం ఉంది. వారిచ్చిన గడువులోగా సమాధానం ఇవ్వకపోతే మరో ఇబ్బంది. ఒకవేళ మీరిచ్చిన వివరణతో వారు సంతృప్తి చెందకపోతే న్యాయపరమైన చిక్కుల్లో పడ్డట్లే. వారు మిమ్మల్ని, మీ లావాదేవీలను అనుమానిత జాబితాలో ఉంచి తగు చర్యలు తీసుకునే అవకాశమూ లేకపోలేదు.
త్వరగా రుణ మంజూరు: రుణ మంజూరుకు బ్యాంకుల్లో అనేక పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అందులో ఐటీఆర్ ఒకటి. గడువులోగా రిటర్నులు ఫైల్ చేస్తే వాటిని ఎక్కడైనా చూపించి రుణం పొందొచ్చు. ఒకవేళ ఆలస్యమైతే.. బ్యాంకులు సైతం మీ రుణ చరిత్రపై అనుమానం వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు. పైగా పెద్ద మొత్తంలో రుణం పొందాలంటే ఐటీఆర్ లేనిదే బ్యాంకుల్లో పనికాదు.
రూ.10 వేల జరిమానా ఉండదు: గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయనివారికి ఆదాయ పన్ను విభాగం రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మరోవైపు సెక్షన్ 234ఏ కింద చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా వసూలు చేస్తారు.