Stock Market Investment Tips: వ్యక్తులను బట్టి పెట్టుబడి ప్రణాళిక మారుతూ ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తికి సరిపోయే పెట్టుబడి విధానం, శైలి 60 ఏళ్ల వ్యక్తికి సరిపోకపోవచ్చు. మదుపు మొత్తం, పెట్టుబడి కాలం, వేచి ఉండే వ్యవధి, నష్టాన్ని తట్టుకునే సామర్థ్యం, ఎంత లాభాలను ఆశిస్తున్నారు, ఎంచుకునే వ్యూహం ఇలా పలు అంశాలు పెట్టుబడులను ప్రభావితం చేస్తుంటాయి. మార్కెట్ ఒక్కో దశలో కొన్ని వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తుంటాయి. ఈ విధానమే సరైనది, ఇదే కచ్చితమైనది అని చెప్పలేం.
సొంతంగా.. సూచీల ఆధారంగా..:మార్కెట్ సూచీని మించి రాబడిని పొందాలనుకునే వారు తరచూ, చురుకుగా షేర్ల క్రయవిక్రయాలు చేస్తుంటారు. ఇలాంటి వ్యూహాన్ని 'యాక్టివ్ ఇన్వెస్టింగ్'గా చెప్పొచ్చు. మార్కెట్‌పై పూర్తి అవగాహన, నైపుణ్యం అవసరం. ఈ వ్యూహం ఎవరికి వారు సొంతంగా పాటించవచ్చు. నిపుణుల సహాయంతోనూ కొనసాగించవచ్చు.
షేర్లు లేదా ఇండెక్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్)లాంటివి కొనుగోలు చేసి, వాటిల్లో దీర్ఘకాలం కొనసాగడం 'పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్' వ్యూహం. స్వల్పకాలిక హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో మెరుగైన రాబడి పొందడమే దీని లక్ష్యం. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంకింగ్ మొదలైన ఇండెక్స్, ఈటీఎఫ్‌లు, నాణ్యమైన షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ఈ కోవలోకే వస్తాయి. పెట్టుబడి వృద్ధి కంటే.. రిస్క్‌తో సంపద సృష్టి కోసం చూస్తున్నవారు యాక్టివ్ ఇన్వెస్టింగ్ వైపు మొగ్గు చూపించొచ్చు. తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో రాబడిని సాధించాలనుకుంటే.. పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ పరిశీలించాలి.
విలువ.. వృద్ధి..:గత పనితీరు బాగుండి, బలమైన ఆర్థిక పునాదులు ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ షేరు ఉండాల్సిన వాస్తవిక ధరకన్నా తక్కువకు లభిస్తుంటుంది. ఇలాంటి షేర్లను ఎంచుకోవడం విలువ ఆధారిత పెట్టుబడి. ఈ కంపెనీలు భవిష్యత్‌లో మంచి పనితీరు కనబరిస్తే.. లాభాలు సొంతం చేసుకోవచ్చు.
అధిక వృద్ధిని నమోదు చేస్తున్న, భవిష్యత్‌లో చేయగల కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టి, అధిక రాబడిని ఆర్జించడం వృద్ధి ఆధారిత పెట్టుబడి వ్యూహం. ఆయా కంపెనీల వస్తూత్పత్తులు, సేవల్లో కొత్తదనం, నాణ్యత, ప్రయోజనాలు మొదలైన అంశాలు ఇక్కడ కీలకం. సహజంగా మిగిలిన వాటికంటే ఇవి అధిక వృద్ధిని నమోదు చేస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో కాస్త అధిక నష్టభయం ఉంటుంది. లాభాలూ ఎక్కువగానే ఉంటాయి.
విలువ ఆధారిత వ్యూహంలో తక్కువ ధర, తక్కువ నష్టభయం ఉండటంతోపాటు, ఓపికతో ఎక్కువ కాలం కొనసాగడం ముఖ్యం. ఈ షేర్లు ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ తిరిగి పుంజుకున్నప్పుడు మంచి రాబడులను అందిస్తాయి. వృద్ధి ఆధారిత వ్యూహంలో షేర్లు బలమైన ఆదాయాలు, లాభాలు ప్రకటిస్తున్నప్పుడు, తక్కువ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నప్పుడు లాభాలను పంచుతాయి.
పెద్ద షేర్లలో..:సహజంగా ఒక రంగంలో ఆధిపత్యంతో, స్థిరమైన పనితీరును చూపించే వాటిని లార్జ్‌క్యాప్ షేర్లుగా చెప్పొచ్చు. ఆర్థికమాంద్యం పరిస్థితుల్లోనూ ఇవి నిలకడగా ఉంటాయి. మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలను భవిష్యత్‌లో వృద్ధికి ఆస్కారం ఉన్న కంపెనీలుగా చెప్పొచ్చు. ఇక్కడ రిస్క్-రివార్డు రెండూ ఎక్కువే. మార్కెట్, ఆర్థిక వ్యవస్థ కోలుకునే దశలో ఇవి మంచి రాబడులను ఇస్తుంటాయి.
భిన్నమైన మార్గంలో..:మార్కెట్లో నలుగురు ఆచరిస్తున్న నిర్ణయాలకు, ఆశ-నిరాశావాదాలకు భిన్నంగా షేర్ల క్రయ విక్రయాలు చేస్తూ రాబడిని పొందడమే ఈ వ్యూహ లక్షణం.