Richest Persons In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లకు మించిన ఆస్తి గల కుబేరులు 78 మంది ఉన్నట్లు 'ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితా- 2022' వెల్లడించింది. వీరి మొత్తం సంపద విలువ రూ.3.90 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు స్పష్టం చేసింది. గతేడాదితో పోల్చితే వీరి ఆస్తి విలువ 3 శాతం పెరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఫార్మా రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో స్థానం సంపాదించారు.
ఆహార ప్రాసెసింగ్, నిర్మాణ రంగాల వారూ ఉన్నారు. దాదాపు రూ.56,200 కోట్ల ఆస్తులతో దివీస్ లేబొరేటరీస్ అధిపతి మురళి కె.దివి, ఆయన కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. హెటెరో ల్యాబ్స్‌కు చెందిన బి.పార్థసారధి రెడ్డి, ఆయన కుటుంబం రూ.39,200 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. రూ.8,700 కోట్ల విలువైన ఆస్తులతో మహిమా దాట్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. తెలుగు రాష్ట్రాల్లోని సంపన్నుల్లో 64 మంది (82%) హైదరాబాద్‌కు చెందిన వారే.
విశాఖపట్నం నుంచి అయిదుగురు, రంగారెడ్డి నుంచి ముగ్గురు ఉన్నారు. ఈసారి ఏపీ, తెలంగాణల నుంచి కొత్తగా 11 మంది జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలే ముందు: దక్షిణ భారతదేశంలో అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందున్నాయని, తత్ఫలితంగా సంపన్నుల సంఖ్య ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోందని ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా పేర్కొంది. పదకొండు సంవత్సరాల క్రితం ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురే ఉండగా, ఇప్పుడు 78 కి పెరగడమే దీనికి నిదర్శనమని వివరించింది.