తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యం వస్తే ఏం చేయాలి? ఆర్థిక భద్రతకు ఎలా సన్నద్ధమవ్వాలి? - recession preparedness

కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడి మాంద్యం ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రేట్ల పెంపు వల్ల మాంద్యం తప్పదని చరిత్ర కూడా చెబుతోంది. 2009 ఆర్థిక మాంద్యం సమయంలోనూ చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి అలాంటి పరిస్థితే ఇప్పుడూ వస్తే ఏం చేయాలి? ఆర్థిక భద్రతకు ఎలా సన్నద్ధమవ్వాలి?

if-recession-is-unavoidable-then-what-should-we-do
మాంద్యం వస్తే ఏం చేయాలి? ఆర్థిక భద్రతకు ఎలా సన్నద్ధమవ్వాలి?

By

Published : Jun 21, 2022, 5:24 PM IST

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. దీంతో వినియోగదార్లకు రుణ వ్యయాలు పెరుగుతూ పోతాయి. వ్యాపారులకూ అధిక వడ్డీ భారం పడుతుంది. దీంతో తప్పనిసరి అవసరాలు మినహా, ఇతర వ్యయాలకు జంకుతారు. ఇవన్నీ ఉద్యోగ వృద్ధిపై.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల మాంద్యం ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రేట్ల పెంపు వల్ల మాంద్యం తప్పదని చరిత్ర కూడా చెబుతోంది. 1955 నుంచి ఇప్పటి దాకా ద్రవ్యోల్బణం 4% కంటే ఎక్కువకు వెళ్లినపుడు; నిరుద్యోగం 5% దిగువకు చేరినపుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండేళ్ల వ్యవధిలోనే మాంద్యంలోకి జారుకుంది. ఇపుడేమో అమెరికా నిరుద్యోగ రేటు 3.6 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం మార్చి నుంచీ 8% పైనే ఉంది.

మరి మాంద్యం వస్తే ఉద్యోగాల్లో భారీ కోత తప్పదు. ఇప్పటికే పలు అంకుర సంస్థలు సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఒకవేళ మాంద్యం దిశగా ఆర్థిక వ్యవస్థ పయనిస్తే ఉద్యోగుల తొలగింపు భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంది. 2009 ఆర్థిక మాంద్యం సమయంలోనూ చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరి అలాంటి పరిస్థితే ఇప్పుడూ వస్తే ఏం చేయాలి? ఆర్థిక భద్రతకు ఎలా సన్నద్ధమవ్వాలి?

  • తొలుత ప్రత్యేకంగా మీ కుటుంబం మొత్తానికి ఒక సమగ్ర ఆరోగ్య బీమా ఉండాలి. భార్యాపిల్లలు, తల్లిదండ్రులు కవర్‌ అయ్యేలా చూసుకోండి. మీ కంపెనీలు అందిస్తున్న బీమా పాలసీకి ఇది అదనంగా ఉండాలి. ఒకవేళ మాంద్యం వచ్చి ఉద్యోగం కోల్పోయినా.. లేదా వేతనంలో కోత విధించినా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే సరిగ్గా అదే సమయంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
  • కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఎప్పుడు ఎలాంటి ఆపదలు వచ్చి పడతాయో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా మీ ఉద్యోగ జీవితం ఆర్థిక మాంద్యం వల్ల చిందరవందరగా మారిన సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తీవ్ర ఇబ్బందులు తప్పవు. అందుకే కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా.. మరో ఉపాధి మార్గాన్ని వెతుక్కునే వరకు ఈ నిధిని కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. అత్యవసర నిధిలో మీ కనీస అవసరాలతో పాటు పిల్లల స్కూలు ఫీజులు, ఈఎంఐలను కూడా కలుపుకోవాలి. ఉదాహరణకు వీటన్నింటికీ కలిపి నెలకు రూ.25 వేలు ఖర్చవుతుందనుకుంటే.. ఆరు నెలలకు సరిపోయే రూ.1.25 లక్షలను సమకూర్చుకోవాలి.
  • అత్యవసర నిధి కింద జమచేసుకున్న డబ్బులో మూడో వంతును ఒక ప్రత్యేక పొదుపు ఖాతాలో జమ చేయాలి. అత్యవసరంగా డబ్బు అవసరమైతే వెంటనే తీసుకునేందుకు వీలుంటుంది. మిగిలిన మొత్తాన్ని లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో మదుపు చేస్తే మేలు. అయితే, ఈ డబ్బు చేతికి రావడానికి కనీసం ఒక రోజు సమయం పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • కొంతమంది అత్యవసర నిధి కోసం జమ చేసిన సొమ్మును రాబడి కోసం స్టాక్ మార్కెట్లలో మదుపు చేస్తుంటారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అత్యవసర నిధి అంటేనే భద్రత కోసం జమ చేసే డబ్బు. దీని లక్ష్యం సంపదను సృష్టించడం కాదు. ఏ ఆపదా తలుపు తట్టి రాదు. కాబట్టి ఈ డబ్బును పోగొట్టుకోవడం సరికాదు. ముఖ్యంగా మాంద్యం సమయంలో అసలు స్టాక్‌ మార్కెట్‌ జోలికి వెళ్లకపోవడమే ఉచితం.

ఇదీ చదవండి:దిగివస్తున్న వంటనూనెల ధరలు.. రెండేళ్లలో తొలిసారి తగ్గుదల

ABOUT THE AUTHOR

...view details