Hyundai Exter SUV Bookings : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా.. తన ఎక్స్‌టర్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మరికొద్ది వారాల్లోనే ఈ కారును భారత్ మార్కెట్లో లాంఛ్ చేసేందుకు సంస్థ సిద్ధమైంది. అందుకోసం బుకింగ్స్ ప్రారంభించినట్లు హ్యుందాయ్ సంస్థ సోమవారం ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ప్రీ-బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు తెలిపిన సంస్థ.. భారత్‌లో ఉన్న తమ డీలర్ల ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చని పేర్కొంది. రూ.11 వేల టోకెన్‌తో ఆన్‌లైన్‌లోనూ ముందుస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
Hyundai Exter SUV Bookings Features : ఐదు సీట్ల సామర్థ్యం కలిగిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్యూవీ.. భారత మార్కెట్లోని ఎంట్రీ-టు మిడ్-లెవల్ వేరియంట్‌లు అయిన టాటా పంచ్, సిట్రోయెన్ సీ3, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లతో పోటీ పడనుంది. ఈ ఎస్‌యూవీని కూడా గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా వంటి కార్ల మాదిరిగానే సంస్థ రూపొందించింది. 1.2 లీటర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో.. కంపెనీ దీన్ని తయారు చేసింది. ఐదు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్లు ఇందులో ఉన్నాయి. 84 హార్స్ పవర్ ఇంజిన్‌తో, 113 న్యూటన్ మీటర్ టార్క్ సామర్థ్యంతో ఈ కారు మార్కెట్లోకి విడుదల కానుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ పెట్రోల్‌తో పాటు సీఎన్జీ వెర్షన్లోనూ వస్తుంది. కారు ఇంటీరియర్ చాలా భాగం.. గ్రాండ్ ఐ10 మాదిరిగానే ఉంటుంది. ఈ కారులో టచ్ స్క్రీన్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కంపాటబిలిటీ సౌకర్యాలు ఉన్నాయి. అదే విధంగా.. మౌంటెడ్ కంట్రోల్‌తో మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. EX, S, SX, SX(O), SX(O)కనెక్ట్.. వంటి ఐదు వెరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంటుంది. కాస్మిక్ బ్లూ, రేంజర్ ఖాకీ అనే రెండు కొత్త రంగులు సహా మరికొన్ని స్పెషల్ కలర్లతో.. 6 సింగిల్-టోన్, 3 డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లలో ఎక్స్టర్ను హ్యుందాయ్ సంస్థ తీసుకొస్తోంది.