ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్.. ఆ సంస్థలో అనేక కీలక మార్పులకు స్వీకారం చుడుతున్నారు. ట్విట్టర్ పగ్గాలు తన చేతికి వచ్చినప్పటి నుంచే తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. వస్తూ వస్తూనే సంస్థలో.. పరిపాలన పరంగా పలు కీలక మార్పులు తీసుకువచ్చారు. బ్లూటిక్ సేవల్లో సైతం మార్పులు చేపట్టారు. ఖాతాల బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్లు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఆ విషయంలో విమర్శలు వచ్చినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు మస్క్‌ను చూసి.. మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నారు. తాము కూడా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ ఫీచర్ తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
అయితే మొదట్లో మస్క్ వైఖరిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. ప్రస్తుతం మస్క్నా.. మజాకా అంటున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో.. యూజర్లను ఆకట్టుకుంటున్నారని కితాబిస్తున్నారు. ట్విట్టర్లో పలు కీలక మార్పులు తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన మస్క్.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు. దీనిపై సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు. ఇకపై ట్విట్టర్ నుంచి కూడా యూజర్లు డబ్బులు సంపాదించుకోవచ్చని తెలిపారు. వేర్వేరు సందర్భాల్లో మస్క్ చెప్పినదాని బట్టి.. రెండు మార్గాల్లో ట్విట్టర్ యూజర్లు ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. ఒకటి కంటెంట్ రాస్తూ.. మరొకటి ట్విటర్లో నగదు లావాదేవీలు చేస్తూ.
కంటెంట్ రాస్తూ.. ఆదాయం..
సాధారణంగా బ్లూ టిక్ లేని యూజర్లు.. 280 అక్షరాలతో ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టవచ్చు. కానీ బ్లూ టిక్ ఉన్న యూజర్లకు మాత్రం.. 4వేల అక్షరాలతో పోస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఆధారంగానే ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చారు మస్క్. ట్విట్టర్ నుంచి డబ్బులు సంపాందించే అవకాశం యూజర్లకు కల్పిస్తున్నారు. యూజర్ పోస్ట్ చేసిన కంటెంట్‌ను చదవాలంటే మాత్రం ఫాలోవర్స్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కంటెంట్ చదవాలనుకున్న వ్యక్తి.. దాన్ని రాసిన వ్యక్తి ఖాతాను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. అందుకు కొంత సొమ్మును చెల్లించాలి. ఈ పద్ధతిలోనే ట్విట్టర్ నుంచి డబ్బులు సంపాందిచుకోవచ్చని మస్క్ తెలిపారు. కేవలం ఒక్క క్లిక్‌తోనే డబ్బులు చెల్లించి.. కంటెంట్ చదవవచ్చని వెల్లడించారు.