Card less ATM Withdrawal : డెబిట్ కార్డు లేకున్నా.. యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఎస్బీఐ అవకాశం కల్పిస్తోంది. తమ బ్యాంకు ఖాతాదార్లతోపాటు ఇతర బ్యాంకుల కస్టమర్లకు కూడా ఈ అవకాశం ఇస్తోంది. ఇందుకోసం ఎస్బీఐ యోనో యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఎవ్వరైనా యోనో యాప్‌లోని 'యూపీఐ క్యూఆర్ క్యాష్' ఆప్షన్‌ను ఎంచుకొని ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
యోనో యాప్ ద్వారా క్యాష్ విత్‌డ్రా ఎలా?
- యోనో యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏటీఎం కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా యాప్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తరువాత 6 నంబర్లు ఉండే ఎంపిన్‌ను సెట్ చేసుకోవాలి. యోనో యాప్‌లో లాగిన్ కావడానికి కచ్చితంగా ఈ ఎంపిన్ ఉండాలి.
- యోనో యాప్‌లో లాగిన్ కావడానికి మరో ఆప్షన్ కూడా ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లతో కూడా యోనో యాప్‌లో లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఎంపిన్ వాడడం సులభంగా ఉంటుంది.
- యోనో యాప్‌లో లాగిన్ అయిన తరువాత అందులో 'యోనో క్యాష్' లేదా 'యూపీఐ క్యూఆర్ క్యాష్' ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ఎంచుకొని.. 'రిక్వెస్ట్ టు యోనో క్యాష్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు యాప్‌లో యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పిన్‌లో ఆరు అంకెలు ఉంటాయి. పిన్ సెట్ చేసుకున్న తరువాత మీకు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నంబర్ వస్తుంది. ఇది కూడా ఆరు నంబర్స్ కలిగి ఉంటుంది.
- యోనో క్యాష్ పిన్, యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ పిన్‌లను సెట్ చేసుకున్న తరువాత దగ్గరలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు వెళ్లి.. డిబిట్కార్డు లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
- మరో ముఖ్య విషయం ఏమిటంటే.. ఈ యోనో యాప్ ద్వారా మీకు దగ్గరల్లో ఉన్న ఏటీఎం సెంటర్ గురించి తెలుసుకోవచ్చు.
ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా ఎలా చేయాలంటే?
YONO Cash Withdrawal Process : ఏటీఎం స్క్రీన్‌పై యోనో క్యాష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటే దీనిపై క్లిక్ చేయాలి. తరువాత యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తరువాత యోనో క్యాష్ పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. వెంటనే ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతాయి.