మరికొద్దిరోజుల్లో పాత ఏడాదికి వీడ్కోలు పలికి.. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే ముందు పాత ఏడాది నుంచి కొన్ని ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలి. ఈ విషయంలో 2022 చాలా ఆర్థిక పాఠాలనే నేర్పింది. భౌగోళిక రాజకీయ అశాంతి కారణంగా ఈ ఏడాది తీవ్రమైన ఆర్థిక అస్థిరత ఏర్పడింది. ద్రవ్యోల్బణం, ఉద్యోగ తొలగింపులు, క్రిప్టోకరెన్సీ పతనం, మాంద్యం భయాలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేశాయి. కాబట్టి వీటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని కొత్త ఏడాదిలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి.
క్రిప్టో పతనం..
2022 సంవత్సరం ప్రారంభంలో క్రిప్టో కరెన్సీ అద్భుతమైన లాభాలతో అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడుల్లో ఒకటిగా చేరింది. అతి తక్కువ సమయంలో అధిక రాబడిని అందిస్తూ, ముఖ్యంగా యువ పెట్టుబడిదారుల్లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అయితే, ఈ కరెన్సీ క్రమబద్ధం లేని పెట్టుబడి కావడం వల్ల తర్వాత కాలంలో ప్రమాదకరమని నిరూపితమైంది. దీని విలువ భారీగా పతనం కావడంతో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులకు గట్టి షాకిచ్చినట్లయ్యింది.
దీంతో నియంత్రణ లేని, ఊహాజనిత పెట్టుబడుల జోలికి పోకూడదని క్రిప్టో కరెన్సీలు నిరూపించాయి. క్రిప్టోకరెన్సీ పతనం ఒక ముఖ్యమైన ఆర్థిక పాఠాన్ని బోధించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మెరిసేదంతా బంగారం కాదని మరోసారి నిరూపితమైందని అంటున్నారు. కాబట్టి సరైన అవగాహన ఉన్న సాధనాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలని వారు సూచిస్తున్నారు.
ఈక్విటీ మార్కెట్..
2022 ప్రథమార్ధంలో స్టాక్ మార్కెట్ కొంత క్షీణతను చవిచూసింది. భౌగోళిక రాజకీయ అశాంతి, ప్రతికూల మార్కెట్ వ్యాఖ్యానాల కారణంగా చాలా పెట్టుబడిదారులు తమ స్టాక్ హోల్డింగ్‌లను వదులుకున్నారు. కానీ ద్వితీయార్ధంలో మన మార్కెట్లు బలమైన రికవరీని సాధించాయి. ఓ దశలో సూచీలు తన గరిష్ఠ స్థాయిలను కూడా అధిగమించాయి.
సంవత్సర ప్రారంభంలో మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ 2022 డిసెంబరు ప్రధమార్థం వరకు ఉన్న పెట్టుబడిదారులు అత్యధికంగా లాభపడ్డారు. గత కొద్దిరోజులుగా మార్కెట్ కొంత పతనం అవ్వడం వల్ల లాభాలు కొంత మేరకు తగ్గాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్కెట్ హెచ్చుతగ్గులు మరింత పెట్టుబడి పెట్టడానికి అనువైన అవకాశం. ఈక్విటీ మార్కెట్‌లో మీరు ఎంత ఎక్కువ కాలం ఉంటారో.. అంత ప్రతిఫలం ఉంటుందని మరోసారి నిరూపితమైంది.