వాహనమేదైనా సరే.. రోడ్డు మీద తిరగాలంటే.. దానికి బీమా (కనీసం థర్డ్‌పార్టీ) ఉండాల్సిందే. ఈ పాలసీని ఏటా గడువులోపే పునరుద్ధరించుకోవాలి. ఎలాంటి క్లెయిం లేకపోతే.. ప్రీమియంలో రాయితీని అందిస్తాయి బీమా సంస్థలు. దీన్నే నో క్లెయిం బోనస్ పేరుతో పిలుస్తారు. ఇది కొన్ని శ్లాబులను బట్టి ఉంటుంది. మొదటి ఏడాది క్లెయిం లేకపోతే 20 శాతం వరకూ ఇది వర్తిస్తుంది. రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరాల్లోనూ ఎలాంటి క్లెయిములూ లేకపోతే.. వరుసగా 25శాతం, 35శాతం, 45శాతం, 50శాతం వరకూ ఎన్‌సీబీ లభిస్తుంది. గరిష్ఠంగా దీన్ని 50శాతానికి పరిమితం చేశారు. మోటార్ బీమా పాలసీని పునరుద్ధరించుకునే సమయంలో ప్రీమియం భారం తగ్గించుకునేందుకు నో క్లెయిం బోనస్ (ఎన్‌సీబీ) ఉపయోగపడుతుంది. ఎన్‌సీబీ ఓన్ డ్యామేజీ (ఓడీ) ప్రీమియానికి మాత్రమే వర్తిస్తుంది.
చిన్న చిన్న నష్టాలకు క్లెయింలు చేసుకోకుండా ఉంటేనే ఎన్‌సీబీ పెరుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగి, వాహనం మరమ్మతు చేయాల్సి వచ్చినప్పుడు వాస్తవంగా అయ్యే ఖర్చు.. నో క్లెయిం బోనస్ ప్రయోజనాన్ని బేరీజు వేసుకోవాలి. ఉదాహరణకు పాలసీ పునరుద్ధరణ సమయంలో రూ.5,000 ఎన్‌సీబీకి అర్హులు అనుకుందాం. ఇప్పుడు చిన్న మరమ్మతుకు రూ.2,000 ఖర్చు అవుతుంది. అప్పుడు మీ చేతి నుంచి రూ.3,000 చెల్లించడమే మంచిది. క్లెయిం చేస్తే రూ.3,000 నష్టపోతారు. బీమా క్లెయిం చేయాలా వద్దా అనేది ఈ లెక్కలు వేసుకున్నాకే నిర్ణయించుకోవాలి.