How To Understand Insurance Documents : ఈ కాలంలో దాదాపు అందరూ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వీటిని తీసుకునే సమయంలో పత్రాలు పూర్తిగా చదవకపోతే, తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సామాన్యులకు అవి అంత సులభంగా అర్థం కావు. అందుకే బీమా పాలసీ పత్రాలు క్షుణ్ణంగా చదవడానికి నిపుణులు కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిని ఫాలో అయితే మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
వాస్తవానికి బీమా పాలసీ పత్రాలు క్లిష్టమైన పదజాలతో నిండి ఉంటాయి. వాటిని సరిగ్గా చదివి అర్థం చేసుకోకుండానే సంతకం పెడితే.. తర్వాతి కాలంలో బీమా క్లెయిమ్ తిరస్కరణ లాంటివి జరగవచ్చు. ముఖ్యంగా పాలసీ కవరేజీ, ప్రత్యేకతలు వివరించే ఫైన్ ప్రింట్‌ను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. పాలసీలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది బీమా ప్రొవైడర్‌కు, పాలసీదారునకు మధ్య ఉన్న స్పష్టమైన ఒప్పందాన్ని తెలియజేస్తుంది. దీనితో పాటు.. పాలసీకి సంబంధించిన ఇతర పత్రాలపై కూడా సరైన పరిజ్ఞానం పెంచుకుంటే.. మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో నిపుణులు ఇస్తున్న సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా!
1. పాలసీ లిక్విడిటీని అంచనా వేయడం
కొన్ని బీమా పాలసీలకు లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది. అంటే పాలసీదారులు ముందస్తుగా బీమా సొమ్మును పొందలేరు. లేదా బీమా నుంచి ఉపసంహరణలు చేసుకోలేరు. ఒక వేళ ఇలా చేస్తే జరిమానా సైతం విధించే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలకు 5 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్
ఉంటుంది. ఈ 5 ఏళ్లలోపు మీకు ఎలాంటి బీమా లభించదు. అందుకే పాలసీ కొనుగోలు చేయడాని కంటే ముందు.. లిక్విడిటీ నిబంధనలను తెలుసుకోవడం ముఖ్యం.
2. వెయిటింగ్ పిరియడ్ గ్రహించడం
కొన్ని హెల్త్ పాలసీలు వెయిటింగ్ పిరియడ్లను కలిగి ఉంటాయి. ఈ నిరీక్షణ వ్యవధి అనేది ఆయా పాలసీలను అనుసరించి మారుతూ ఉంటుంది. ఈ వెయిటింగ్ పిరియడ్ పూర్తి అయ్యే వరకు పాలసీ యాక్టివేట్ అవ్వదు. అప్పటి వరకు మీకు ఎలాంటి బీమా సొమ్ము లభించదు.
3. బోనస్‌ల గురించి ఆలోచించవద్దు
ఇన్సూరెనస్ పాలసీల్లో.. పేఅవుట్ బోనస్‌లకు ఎలాంటి గ్యారెంటీ ఉండదు. ఇది కేవలం బీమా కంపెనీల విచక్షణ, లాభంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.