తెలంగాణ

telangana

ETV Bharat / business

బీమా సంస్థను ఎంచుకునేటప్పుడు ఏం చూడాలో తెలుసా?

జీవితంలో అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే.. వెంటనే పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. అందుకే చాలా మంది ముందుగానే బీమా పాలసీలు తీసుకుంటారు. అయితే కొందరు కస్టమర్లు పాలసీని ఎంచుకునేటప్పుడు ఖర్చు, కవరేజీలను మాత్రమే చూస్తారు. కానీ, బీమా సంస్థ ఎంపికకు ఇవి మాత్రమే సరిపోవు. అగ్ర బీమా సంస్థ అయినా సరే కొన్ని పరిమితులు ఉంటాయి. బీమా పాలసీ తీసుకునేప్పుడు ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే అవేంటో తెలుసుకుందామా మరి..!

best insurance company
best insurance company

By

Published : Feb 12, 2023, 6:15 PM IST

అనుకోని ప్రమాదాల కారణంగా వచ్చే నష్ట భయం తగ్గించడంలో బీమాది కీలక పాత్ర. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళికలో జీవిత, ఆరోగ్య, మోటారు, సైబర్, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ వంటి ప్రాథమిక బీమా పథకాలను తీసుకోవాలి. అయితే బీమా ప్లాను కొనుగోలు చేసేటప్పుడు ధర, కవరేజీని మాత్రం చూస్తే సరిపోతుందా? అంటే కాదనే చెప్పాలి. సాధారణంగా బీమా కవరేజీ కోసం వెతుకుతున్నప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక బీమా పాలసీలను అంచనా వేయడం, అందులో నుంచి కొనుగోలు చేయాలనుకుంటున్న బీమా పాలసీలను అందిస్తున్న అగ్ర బీమా సంస్థల జాబితాను రూపొందించుకోవడం చేస్తుంటారు. అయితే, ఇది మాత్రమే సరిపోదు. బీమా పాలసీని అందించే సంస్థను ఎంపిక విషయంలో కొన్ని పారామితులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బీమా సంస్థ చెల్లింపుల సామర్థ్యం..
బీమాలో అత్యంత కీలకమైంది క్లెయింలు. ఆమోదయోగ్యమైన క్లెయింలను గౌరవించడం బీమా సంస్థ విధి. బీమా సంస్థ క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో వారి క్లెయిం చెల్లింపు సామర్థ్యాన్ని స్పష్టం చేస్తుంది. దీన్ని శాతంలో తెలుపుతారు. బీమా సంస్థ అందుకున్న మొత్తం క్లెయింలలో సెటిల్‌ చేసిన క్లెయింలను లెక్కించడం ద్వారా సీఎస్‌ఆర్‌ వస్తుంది. ఉదాహరణకు బీమా సంస్థ 100 క్లెయింలను స్వీకరించి 95 క్లెయింలను పరిష్కరించినట్లయితే ఆ సంస్థ క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో 95%గా ఉంటుంది. సీఎస్‌ఆర్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియోతో పాటు.. ఆ కంపెనీ ఎంత త్వరగా క్లెయింలను పరిష్కరిస్తుందో కూడా చూడాలి. క్లెయిం సెటిల్‌మెంట్‌ ప్రక్రియ దీర్ఘకాలం సాగే రోజులు పోయాయి. బీమా సంస్థలు సాంకేతికతలను, సాధనాలను అందిపుచ్చుకుని నిమిషాలు, గంటల వ్యవధిలోనే క్లెయిం సెటిల్‌మెంట్‌ చేస్తున్నాయి.

సాల్వెన్సీ రేషియో..
సాల్వెన్సీ రేషియో అనేది బీమా సంస్థకున్న నగదు ప్రవాహాన్ని ప్రతిబింబిస్తుంది. బాధ్యతలను నెరవేర్చేందుకు సంస్థకు ఉన్న సామర్థ్యాన్ని సూచిస్తుంది. సరళంగా చెప్పాలంటే ఇది బీమా సంస్థ ఆర్థిక ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. అన్ని సంస్థలు 150% లేదా 1.50 సాల్వెన్సీ రేషియోను నిర్వహించాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. అధిక సాల్వెన్సీ రేషియో ఉన్న సంస్థకు మెరుగైన క్లెయిం చెల్లింపు సామర్థ్యం ఉంటుంది.

క్యాష్ లెస్ నెట్‌వర్క్‌..
ప్రతి బీమా సంస్థా.. వివిధ నగరాల్లో విస్తరించి ఉన్న నెట్‌వర్క్‌ ఆసుపత్రులు, గ్యారేజీల జాబితాను కలిగి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి, ఈ జాబితాలోని ఆసుపత్రులు, గ్యారేజీల్లో నగదు రహిత క్లెయిం సెటిల్‌మెంట్‌ సౌకర్యాన్ని పొందొచ్చు. బీమా చేసిన వ్యక్తి ఎటువంటి ఖర్చు లేకుండా, అవాంతరాలు లేని, వేగవంతమైన, నాణ్యమైన సేవలను పొందగలగడమే ఈ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు, గ్యారేజీలు అందించే అతి పెద్ద ప్రయోజనం. నాన్‌-నెట్‌వర్క్‌ ఆసుపత్రులు, గ్యారెజీల్లో మాదిరిగా బీమా చేసిన వ్యక్తి ముందుగా చెల్లించి, రీయింబర్స్‌మెంట్‌ క్లెయిం చేయాల్సిన పనిలేదు. కాబట్టి, విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉన్న బీమా సంస్థను ఎంచుకోవడం ద్వారా బీమా చేసిన వ్యక్తి మొత్తం ప్రక్రియను సున్నితంగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేయవచ్చు.

చివరిగా..
పైన పేర్కొన్న అంశాలతో పాటు, బీమా సంస్థను ఖరారు చేసేముందు బీమా సంస్థ కీర్తి, సంస్థ వినియోగదారులకు అందిస్తున్న సేవలనూ తెలుసుకోవడమూ ముఖ్యమే. అనేక ఉత్పత్తులను అందిస్తున్న బీమా సంస్థలను మార్కెట్లో చూస్తుంటాం. కొన్ని సంస్థలు ఆశ్చర్యం కలిగించేలా తక్కువ ధరతో పాలసీలను ఆఫర్‌ చేస్తుంటాయి. ఇవి కస్టమర్లను ఆకర్షించేందుకు మాత్రమే కావొచ్చు. ఇలాంటి కంపెనీలు క్లెయిం సమయంలో ముందుకు రాకపోవచ్చు. బీమాదారునికి కావాల్సిన మద్దతును ఇవ్వకపోవచ్చు. మెరుగైన సేవలను అందించే బీమా సంస్థల పాలసీలు కాస్త ఖరీదైనవిగా ఉండొచ్చు. కాబట్టి కేవలం 'ధర'పైనే దృష్టి పెట్టడం కంటే బీమా సంస్థ ఇచ్చే 'విలువ'కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

ABOUT THE AUTHOR

...view details