Money Saving Tips: ఉద్యోగమో, వ్యాపారమో చేస్తూ.. ఆర్జించిన సొమ్మును జాగ్రత్త చేసుకోవటం ఎలా? ఎవరినంటే వారిని నమ్మి, వాళ్ల చేతుల్లో పోయటమా లేక నమ్మకమైన మార్గాల్లో ముందుకు సాగటమా..? కొత్తగా సంపాదనపరులైన వారికి ఎదురయ్యే సందేహమే ఇది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తాము ఏ మేరకు పొదుపు చేయగలం, దాన్ని సురక్షితంగా మంచి ప్రతిఫలం లభించే పథకాల్లో ఏ విధంగా మదుపు చేయాలి..? అనేది ఆలోచించుకోవాలి. అటువంటి వారు ఈ సూత్రాలు పాటించాలి.
టర్మ్ పాలసీతో: అన్నింటికంటే ముందుగా మీకు జీవిత బీమా ఎంతో అవసరం. మీరు సంపాదన పరులు కాబట్టి మీమీద ఆధారపడిన కుటుంబానికి అనుకోని ఉపద్రవం ఎదురుకాకుండా భరోసా కావాలి. అందువల్ల ఒక టర్మ్ పాలసీ తప్పనిసరి. వార్షికాదాయానికి 10 నుంచి 12 రెట్లు మొత్తానికి సమానమైన టర్మ్ పాలసీ తీసుకోవాలి.
ఆన్‌లైన్ మోసాల బారిన పడొద్దు:ఇ-మెయిల్ ఆధారంగా మీకో పెద్ద లాటరీ తగిలింది. ప్రాసెసింగ్ ఖర్చుల కింద ఒక రూ50,000 ట్రాన్స్‌ఫర్ చేస్తే చాలు,... లాటరీ మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తాం, మీ బ్యాంకు ఖాతా వివరాలు, పాన్, ఆధార్ నెంబర్లు పంపండి- అనే మెయిల్ ఒక రోజు మెయిల్ బాక్స్‌లో ప్రత్యక్షమవుతుంది. సహజంగా ఎవరైనా దీనికి ఆశపడిపోతారు. లాటరీ వచ్చిందంటే సంతోషపడనిది ఎవరు. కానీ అదొక పెద్ద ట్రాప్, అనేది తెలుసుకోలేకపోతే మొత్తానికే మోసపోతారు. చేతిలో సొమ్ము పోవటంతో పాటు మీ బ్యాంక్ ఖాతాను సైతం హ్యాక్ చేసి మొత్తం ఊడ్చేసే ప్రమాదం ఉంది. ఇదొక రకమైన ఆన్‌లైన్ మోసం మాత్రమే. ఇటువంటి ఎన్నో రకాలైన వలలు విసిరేవారు ఆన్‌లైన్‌లో ఎంతో పెరిగిపోయారు. వీటన్నింటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.