How To Save Money Using Credit Card :పండుగ సీజన్ వచ్చేసింది. కస్టమర్లను ఆకర్షించేందుకు.. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లు అన్నీ భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్స్, షాపింగ్ మాల్స్ కూడా అదిరిపోయే డీల్స్ అందిస్తున్నాయి. మరి మీరు కూడా భారీగా షాపింగ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే కాస్త తెలివిగా ఆలోచించండి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసే ముందు.. ఇక్కడ తెలిపిన కొన్ని కీలకమైన విషయాలను గుర్తుంచుకోండి. (Top Tips To Use Credit Cards Wisely For Festival Shopping)
ముందే బడ్జెట్ వేసుకోవాలి!
క్రెడిట్ కార్డ్‌ను చాలా జాగ్రత్తగా, తెలివిగా వాడాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు లాభపడతారు. లేకుంటే.. అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే.. ముందుగానే మీకు అవసరమైన వస్తువుల లిస్ట్ తయారు చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా బడ్జెట్‌ను ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత ఈ బడ్జెట్ మీ ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అంటే మీ ఆదాయం, అప్పులు, కట్టాల్సిన ఈఎంఐలు, ఖర్చులు అన్నింటినీ సరిగ్గా బ్యాలెన్స్ అయ్యేలా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఒక వేళ మీ బడ్జెట్ లిమిట్స్ దాటితే .. అనవసరమైన, ఫ్యాన్సీ వస్తువులను నిర్మొహమాటంగా మీ లిస్ట్ నుంచి తొలగించండి.
సరైన క్రెడిట్ కార్డ్ ఎంచుకోవాలి!
How To Choose Right Credit Card : క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా పాఫ్యులర్ రిటైలర్స్, ఆన్లైన్ మార్కెటింగ్ వెబ్‌సైట్స్ అందించే ఆఫర్స్, డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్‌లను.. ఉపయోగించుకునేందుకు వీలు కల్పించే క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోవాలి. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా పండుగ సీజన్ కోసమే క్రెడిట్ కార్డ్‌లను అందిస్తూ ఉంటాయి. వాటిని కూడా పరిశీలించవచ్చు. ఎందుకంటే అవి మంచి క్యాష్‌బ్యాక్, జీరో- ఇంట్రస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కలిగి ఉంటాయి. కొన్ని క్రెడిట్ కార్డులను యాన్యువల్ ఫీజు లేకుండా అందిస్తూ ఉంటారు. మరికొన్ని క్రెడిట్ కార్డులను తక్కువ వడ్డీ రేటుతో అందిస్తూ ఉంటారు. కనుక ఇలాంటి వాటిని ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల మీ షాపింగ్ ఖర్చులు భారీగా తగ్గుతాయి.
క్రెడిట్ లిమిట్ దాటవద్దు!
Credit Card Limit Check : ప్రతి క్రెడిట్ కార్డ్‌కు ఒక లిమిట్ ఉంటుంది. ఆ పరిమితిని దాటి క్రెడిట్ వాడుకోవడం మంచిది కాదు. సాధారణంగా మన క్రెడిట్ లిమిట్లో 30 శాతానికి మించి వాడకపోవడం మంచిది. పండుగ సీజన్లో భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్, డీల్స్ మనల్ని ఊరిస్తూ ఉంటాయి. వీటి ట్రాప్‌లో పడితే అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. ఒక వేళ మీరు కచ్చితంగా షాపింగ్ చేయాల్సి వస్తే.. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను తాత్కాలికంగా పెంచమని.. సదరు క్రెడిట్ కార్డును ఇష్యూ చేసిన బ్యాంక్‌ను రిక్వెస్ట్ చేయండి.
రీపేమెంట్స్ సకాలంలో చేయాలి!
Credit Card Repayment Plan : వాస్తవానికి క్రెడిట్ కార్డ్‌ను.. లిమిట్‌కు మించి ఎప్పుడూ ఖర్చు చేయకూడదు. ఒకవేళ చేసినా సకాలంలో వాటిని తీర్చేయాలి. లేకుంటే భారీ మొత్తంలో వడ్డీ, పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. పైగా మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల భవిష్యత్‌లో మీకు రుణం లభించే అవకాశం కూడా బాగా తగ్గుతుంది. ఒక వేళ మీపై ఈఎంఐ భారం ఎక్కువగా ఉంటే.. దానిని కొంత మేరకు తగ్గించమని.. మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసిన బ్యాంకును రిక్వెస్ట్ చేయండి.