సాధారణంగా ఫలానా తేదీన రైలు ప్రయాణం అనుకున్నప్పుడు టికెట్లను ముందుగానే రిజర్వేషన్ చేసిపెట్టుకుంటాం. ఒక్కోసారి అనుకున్న షెడ్యూల్‌లో ఏదైనా మార్పులు వచ్చి ప్రయాణాన్ని ముందుగానే చేయాల్సి రావొచ్చు. లేదంటే వాయిదా వేయాల్సి రావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో టికెట్ రద్దు చేసి మళ్లీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. టికెట్ రద్దు చేసుకుంటే రైల్వే శాఖ క్యాన్సిలేషన్ రుసుములు మినహాయించుకుని మిగిలిన డబ్బును మాత్రమే తిరిగి చెల్లిస్తుంది. దీనివల్ల ప్రయాణికులు కొంత డబ్బును నష్టపోతుంటారు.
అయితే, ప్రయాణికులు పూర్తిగా ప్రయాణాన్ని రద్దు చేసుకోకుండా ముందు లేదా తర్వాతి తేదీలకు ప్రయాణాన్ని మార్చుకోవాలనుకుంటే, క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండానే టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు రైలు ప్రయాణం ప్రారంభం కావడానికి కనీసం 48 గంటల ముందే రిజర్వేషన్ కౌంటర్ పనివేళల్లో వెళ్లి మీ టికెట్‌ను సరెండర్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో మీరు ఏ తేదీన ఏ సమయంలో ప్రయాణించాలనుకుంటున్నారో రిజర్వేషన్ కార్యాలయంలోని ఉద్యోగులకు తెలియజేయాలి. ఈ సమయంలో ప్రయాణికులు ప్రయాణపు తరగతిని కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.