Banking Services In Whatsapp : సాంకేతికత అభివృద్ధి చెందడంతో బ్యాంకులు పలు సేవలను డిజిటల్ విధానంలో అందిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా తమ సర్వీసులను మరింత విస్తరించే దిశగా ముందుకెళ్తున్నాయి. దీనిలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైన వాట్సాప్ ద్వారా కూడా పలు సేవలను అందుబాటులో ఉంచుతున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి అన్ని ప్రధాన బ్యాంకులూ తమ ఖాతాదారులకు 'వాట్సాప్ బ్యాంకింగ్' సౌకర్యాన్ని అందిస్తున్నాయి. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మినీ స్టేట్‌మెంట్, చెక్ స్టేటస్ ఎంక్వైరీ, చెక్‌బుక్ రిక్వెస్ట్, డెబిట్ కార్డు బ్లాకింగ్, రుణాలు వంటి పలు సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాయి. ఈ సేవలను పొందాలంటే ఆయా బ్యాంకు కస్టమర్లు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎస్‌బీఐ
ఎస్‌బీఐ తమ వినియోగదారులకు ఇటీవలే వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీసును పొందడం కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. కస్టమర్లు తమ మొబైల్ నంబర్ నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తమ ఖాతా నంబర్ టైప్ చేసి 72089 33148 నంబర్‌కు మెసేజ్ చేయాలి. అయితే, మీరు బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి మాత్రమే ఈ మెసేజీని పంపించాలని గుర్తుంచుకోండి. లేదంటే ఈ సర్వీస్ పొందలేరు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి +91 90226 90226కి 'Hi' అని వాట్సాప్ మేసేజ్ చేయాలి. అక్కడ ఇచ్చే సూచనలను అనుసరించి మీకు కావాల్సిన సేవను పొందవచ్చు.
పీఎన్‌బీ
బ్యాంకింగ్ సేవలను మరింతగా అందుబాటులో తెచ్చే ప్రయత్నంలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) అక్టోబరు 3న వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు బ్యాంకు కస్టమర్లతో పాటు నాన్-కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని బ్యాంకు తెలిపింది. ఈ సేవలను యాక్టివేట్ చేసుకునేందుకు వినియోగదారులు ముందుగా తమ ఫోన్‌బుక్‌లో పీఎన్‌బీ అధికారిక వాట్సాప్ నంబరు +91 92640 92640ను సేవ్ చేయాలి. తర్వాత ఈ నంబర్‌కు వాట్సాప్‌లో 'హాయ్/ హలో' పంపించడం ద్వారా సంభాషణను ప్రారంభించవచ్చు.