How To Reduce Motor Insurance Premium : వాహనం కొనుగోలు చేసేటప్పుడే తప్పనిసరిగా తీసుకోవాల్సిన వాటిల్లో వాహన బీమా ఒకటి. ఈ పాలసీని తీసుకోవటం వల్ల అనుకోకుండా మన వాహనాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ మొత్తాన్ని సదరు బీమా సంస్థ భరిస్తుంది. అంటే మనం నష్టపోయిన డబ్బును పరిహారంగా చెల్లిస్తుంది. అయితే కొన్నిసార్లు వీటికి కట్టే ప్రీమియం అధిక మొత్తంలో ఉండటం వల్ల చాలామంది వాహనదారులకు ఇది ఆర్థిక భారంగా మారుతుంది. అయితే ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లోనే ఈ పాలసీలను తీసుకోవటం లేదా రెన్యూవల్ చేయించటం ద్వారా కొంత తక్కువ మొత్తానికే వీటిని పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు ప్రత్యేకమైన ఆపర్లను సైతం ప్రకటిస్తుంటాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. వీటిని తెలుసుకోవటం ద్వారా తక్కువ ధరకే పాలసీలను పొందే వీలుంటుంది. మరి ఈ సౌలభ్యాన్ని పొందాలంటే మీరు తప్పక అనుసరించాల్సిన ఆ ఐదు విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
పాలసీలను పోల్చి చూడండి
మీరు ఆఫ్‌లైన్‌లో పాలసీలను కొనుగోలు చేసేటప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నవాటితో పోల్చి చూడండి. ఇలా చేయటం ద్వారా కొత్త పాలసీలు అవి అందించే కవరేజ్ అంశాలపై అవగాహన వస్తుంది. ఇలా చేయడం వల్ల మనం కట్టే ప్రీమియం ఖర్చు తగ్గటమే కాకుండా అదనపు కవరేజీలున్న మంచి పాలసీని మనం ఎంచుకోవచ్చు. ఇంటర్నెట్లో పాలసీల మధ్య తేడాలు స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి మనకు తక్కువ రేటులో లభించే ఇన్సూరెన్స్ ఏదో తెలుసుకొని దానిని కొనుగోలు చేయడం ఉత్తమం.
నో క్లెయిమ్ బోనస్
మీ గత పాలసీకి సంబంధించి ఒకవేళ మీరు ఎటువంటి క్లెయిమ్‌ను పొందనట్లయితే మీ పాలసీ రెన్యూవల్ సమయంలో భారీ తగ్గింపును పొందవచ్చు. సాధారణంగా ఇన్సూరెన్స్ సమయంలో ఎటువంటి క్లెయిమ్ చేయని కస్టమర్లకు బీమా కంపెనీలు ఈ రకమైన ఆఫర్లను అందిస్తుంటాయి.
బీమా ప్రమోషన్లను తెలుసుకోండి
వాహన బీమా కంపెనీలు తమ ప్లాన్లను ప్రమోషన్ చేసే సమయంలో భారీ తగ్గింపులు వాహనదారులకు అందిస్తుంటాయి. ఆన్లైన్లో వీటిపై ఓ దృష్టి పెట్టండి. ఈ ఆఫర్లు క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు ఏ రూపంలోనైనా ఉండవచ్చు. సాధారణంగా ఈ రకం ఆఫర్లు ఎక్కువ శాతం ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయి. కనుక బీమా కంపెనీల వైబ్సైట్లను, వాటికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను తరచు చెక్ చేస్తూ ఉండండి.