కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి వెంటనే క్రెడిట్ కార్డు ఇస్తామంటూ బ్యాంకులు ఫోన్ చేస్తుంటాయి. సులభంగా లభిస్తుంది కదా అని చాలామంది కార్డులను తీసుకుంటారు. ఎంతోమంది తొలి రుణం క్రెడిట్ కార్డు ద్వారానే తీసుకుంటారు. బిల్లు చెల్లించేందుకు 40-50 రోజుల వ్యవధి ఇస్తున్నారు కదా.. అని కనిపించిందల్లా కొనడం అలవాటవుతుంది. నెలనెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తే ఇబ్బందేమీ లేదు. కానీ, ఆదాయానికి మించి కొనుగోళ్లు చేసి, మొత్తం బిల్లు చెల్లించకుండా.. కనీస మొత్తం కడితే మాత్రం.. అప్పుల ఊబిలో కూరుకుపోవడం ప్రారంభమైనట్లే. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుంటే.. ఏడాదికి 36-40 శాతం వరకూ వడ్డీ విధిస్తాయి. కొన్నిసార్లు వీటిని వదిలించుకునేందుకు కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది. పైగా క్రెడిట్ స్కోరు దారుణంగా దెబ్బతింటుంది.
20 శాతం లోపే..
భవిష్యత్తులో ఆదాయం అధికంగా ఉంటుందని, ఇప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయడం చాలామందికి అలవాటు. రేపటి సంగతి తరువాత.. ఇప్పుడు మన ఆర్థిక స్థితి ఏమిటన్నదే చూసుకోవాలి. ఆర్జించే ఆదాయాన్ని బట్టి, అప్పులు తీసుకోవాలి. అంతేకానీ.. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని తీసుకోకూడదు. మీ నెలవారీ ఆదాయంలో 20 శాతానికి మించి రుణ వాయిదాలు చెల్లించకుండా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్తు కోసం ఎంతోకొంత పొదుపు, పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది.