తెలంగాణ

telangana

ETV Bharat / business

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

కొవిడ్‌ తర్వాత అందరికీ ఆరోగ్య బీమా పాలసీపై అవగాహన పెరిగింది. అయితే, ప్రీమియం ఖర్చును చూసి కొందరు వెనకడుగు వేస్తున్నారు. కానీ, కొన్ని మార్గాల ద్వారా ప్రీమియం మొత్తాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంది.

How to reduce health insurance premium
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించుకునే మార్గాలు

By

Published : Nov 27, 2022, 5:10 PM IST

జీవనశైలి రుగ్మతలు, మానసిక ఒత్తిడి, వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరైంది. కరోనా సంక్షోభం అనంతర ప్రపంచంలో దీని అవసరం మరింత పెరిగిందనే చెప్పాలి. క్రమంగా ఆరోగ్య బీమా ప్రాముఖ్యత గురించి అవగాహన పెరుగుతోంది. అంతేకాకుండా, పాలసీల సంఖ్యతో పాటు బీమా మొత్తం కూడా పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య తమను, కుటుంబాలను రక్షించుకోవడానికి చాలా మంది ఆరోగ్య బీమా పాలసీ కోసం వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రీమియం ఖర్చును తగ్గించుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం తగ్గించుకోవడానికి ఉన్న కొన్ని మార్గాలను పరిశీలిద్దాం..

ముందుగానే కొనండి..
ఆరోగ్య బీమా ప్రీమియంపై ఎక్కువగా ప్రభావం చూపే అంశం వయసు. చిన్న వయసులోనే కొనుగోలు చేయడం వల్ల తగ్గింపు లభిస్తుంది. ముందు నుంచీ వ్యాధులు ఉన్నవారికి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.

నో క్లెయిమ్ బోనస్‌ను ఉపయోగించుకోండి..
"నో క్లెయిమ్ బోనస్" తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా మొత్తాన్ని పొందడానికి గొప్ప మార్గం. పాలసీ వ్యవధిలో ఎటువంటి బీమా క్లెయిమ్ చేయకుంటే, ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించకుండానే తదుపరి సంవత్సరానికి మీ పాలసీలో భాగంగా అదనపు బీమా మొత్తాన్ని పొందవచ్చు. ఈ రోజుల్లో, చాలా బీమా సంస్థలు ఎన్‌సీబీ వెసులుబాటును అందిస్తున్నాయి. ఉదాహరణకు, మీరు రూ.10 లక్షల మొత్తంతో పాలసీని కొనుగోలు చేశారనుకుందాం. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు క్లెయిమ్‌ చేయలేదు. అప్పుడు బేస్ పాలసీ కంటే అదనంగా రూ.8-10 లక్షల బీమా మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఇది పాలసీని బట్టి మారుతూ ఉంటుంది. మీరు తీసుకునే పాలసీ ఏ రకమైన ఎన్‌సీబీ ప్రయోజనాలను అందజేస్తుందో ముందే తెలుసుకోవాలి.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి..
బీమా ప్రీమియాన్ని తగ్గించుకోవడానికి ఉన్న మరొక మార్గం మీ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం. ఆన్‌లైన్‌లో బీమా పంపిణీ ఆఫ్‌లైన్‌తో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనివల్ల కంపెనీలు కొంతమేర నిర్వహణ వ్యయాల్ని తగ్గించుకోగలుగుతాయి. ఈ ప్రయోజనంలో కొంత భాగాన్ని పాలసీదారులకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో కంపెనీలు ప్రీమియంలో రాయితీ కల్పిస్తాయి.

2-3 ఏళ్లకు ఒకేసారి..
ఈ రోజుల్లో చాలా బీమా సంస్థలు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఆరోగ్య పాలసీలను అందిస్తున్నాయి. దీనివల్ల ప్రీమియం తగ్గింపుతో పాటు, ఏటా పెరిగే పెంపు నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. మీరు రెండేళ్ల ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ద్వారా 10 శాతం వరకు తగ్గింపు, మూడేళ్ల పాలసీపై 15 శాతం వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది.

ఫ్యామిలీ ఫ్లోటర్‌ను ఎంచుకోండి..
ఆరోగ్య బీమా అవసరాలు ప్రతి వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి, అయితే, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లను ఒక కుటుంబంలోని సభ్యులందరికీ సరిపోయేలా రూపొందించారు. ఒక వ్యక్తికి మాత్రమే వర్తించే వ్యక్తిగత కవర్‌కు భిన్నంగా, ఫ్యామిలీ-ఫ్లోటర్ ప్లాన్ మొత్తం కుటుంబ వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. ఒక్కొక్కరికీ వ్యక్తిగత ప్లాన్‌ను తీసుకోవడంతో పోలిస్తే ఇది చాలా తక్కువ ప్రీమియంకే అందుబాటులో ఉంటుంది. కుటుంబంలో వైద్య చికిత్స అవసరమైన ఎవరైనా ప్లాన్ కింద హామీ ఇచ్చిన మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details