How To Reduce Expenses And Save Money : మరి కొద్ది రోజుల్లో పండగలు రానున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఎక్కడ చూసినా రాయితీల సందడే నెలకొంది. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా ఆందోళన కలిగిస్తోంది. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వల్ల రుణాలు సైతం భారమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి రూపాయినీ ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'ఈ రోజు అవసరం లేని వస్తువులు కొంటే.. రేపు అవసరమైన వాటికి అమ్ముకోవాల్సి వస్తుంది.' వృథా ఖర్చులకు నేడు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్ లక్ష్యాలు దెబ్బతింటాయి' అనేది ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెప్పే మాట. ఈ నేపథ్యంలోనే వ్యయ నియంత్రణ పాటించేందుకు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...
ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు..
ఈ సూత్రం ఆర్థిక విషయాల్లో చాలా కీలకం. జీతం వచ్చిన వెంటనే ఖాతాలో ఉన్న డబ్బు మనల్ని ఊరిస్తుంటుంది. ఖర్చు చేసే విషయంలో కొంచెం కూడా ఆలోచించం. కానీ, నెల చివరి వారంలో చాలామంది చిన్న అత్యవసరం వచ్చినా ఆందోళన చెందుతుంటారు. సమయం, సందర్భాన్ని అనుసరించి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని ఏ మాత్రం తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడమనేది పొరపాటని తెలుసుకోవాలి. వృథా ఎక్కడ చేస్తున్నామో గమనిస్తే.. పొదుపు పెరుగుతుందన్న సంగతి మర్చిపోవద్దు.
బడ్జెట్ వేసుకోండి..
ప్రతి ఖర్చుకూ కచ్చితంగా ఒక లెక్క ఉండాలి. బడ్జెట్.. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్న దానిపై బడ్జెట్ వేసుకోండి. బోనస్‌ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అనే విషయాన్ని ముందే నిర్ణయించుకోండి. వచ్చిన బోనస్‌లో కనీసం 50-60 శాతం పెట్టుబడికి మళ్లించాలి. మిగతా మొత్తాన్ని మీ ఇష్టానుసారం ఖర్చు చేయండి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ ముందుగా 20-30 శాతం పొదుపు చేశాకే.. ఖర్చు చేయాలనే నిబంధన ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలి. 40 శాతానికి మించి బ్యాంకు వాయిదాలు లేకుండా చూసుకోవడం మంచిది. ఖర్చుల కోసం ప్రత్యేక అకౌంట్‌ను కేటాయించండి. ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలనుకున్నా, సెలవుల్లో విహార యాత్రకు వెళ్లినా అన్నీ మీ బడ్జెట్‌లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే, మీ పొదుపు మొత్తం తగ్గి, భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది.
భావోద్వేగాల అదుపు..
డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా అనేక సందర్భాల్లో ఉంటుంది. అందుకే జీవన ఖర్చుల కోసం డబ్బును ఎక్కువగా కేటాయిస్తుంటారు. ఇది సాధారణ విషయమే అనుకున్నా.. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువులను , ఖరీదైన దుస్తులను కొనడం లాంటి.. అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలి అనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవడం మంచిది