ఎవరైనా బ్యాంకులో రుణం తీసుకున్న తరువాత అది కట్టకుండానే మరణిస్తే.. బ్యాంక్లు, రుణసంస్థలు రుణ వసూలుకు చట్టపరంగా ముందుకు వెళ్లక తప్పదు. దానికి బ్యాంకులు కింది విధంగా చేస్తాయి.
గృహ రుణం:
రుణగ్రహీత మరణిస్తే, బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించగల సహ రుణగ్రహీత కోసం బ్యాంకు మొదట అన్వేషిస్తుంది. సహ-రుణగ్రహీత కూడా లేనప్పుడు బ్యాంకు రుణానికి ఉన్న హామీదారుని లేదా చట్టపరమైన వారసుడిని సంప్రదిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మరణించిన రుణగ్రహీత గృహ రుణ బీమా కవర్ తీసుకుంటే.. బీమా క్లెయిమ్ మొత్తం నేరుగా బ్యాంకు తీసుకుని బాకీ ఉన్న రుణాన్ని వసూలు చేసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబానికి అందజేస్తుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటే:
గృహ రుణ బకాయిదారుడు టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుంటే.. ఆ క్లెయిమ్ మొత్తం నామినీ ఖాతాలో జమ అవుతుంది. న్యాయపరమైన ప్రక్రియ తర్వాత చట్టపరమైన వారసుడికి ఈ క్లెయిమ్ మొత్తం అందుతుంది. అయితే, బ్యాంకు రుణ బకాయి వసూలుకు ఇక్కడ ఒక సమస్య ఉంది. టర్మ్ బీమా క్లెయిమ్ మొత్తాన్ని బ్యాంకు రుణ బకాయి కింద తీసుకోలేదు. ఈ టర్మ్ బీమా క్లెయిమ్ మొత్తాన్ని ఉపయోగించుకునే హక్కు చట్టబద్ధమైన వారసుడికి మాత్రమే ఉంటుంది. గృహ రుణ బీమా లేనప్పుడు.. సహ-రుణగ్రహీత, చట్టపరమైన వారసుడు లేదా హామీదారు నుంచి బ్యాంకు బకాయి మొత్తాన్ని తిరిగి పొందలేకపోతే.. ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని రుణ బకాయికి సర్దుబాటు చేసుకుంటుంది.