How To Prevent Rejection Of Vehicle Insurance Claim : మన దేశంలో వాహన బీమా అనేది చట్టబద్ధమైన అంశం. వాహనం కొనుగోలు చేసే సమయంలో దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు జరిగిపోతాయి. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాహనానికి ఏదైనా డ్యామేజ్ జరిగితే వాహన బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ మోటారు వాహనానికైనా 1988 మోటారు వాహన చట్టం ప్రకారం థర్డ్ పార్టీ బీమాను కలిగి ఉండడం తప్పనిసరి. అయితే, ఇది మోటారు వాహనానికి జరిగే నష్టాన్ని భర్తీ చేయలేదని.. అందువల్ల, సమగ్ర మోటారు బీమా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు.
ఈ రకమైన బీమా మీ వాహనాన్ని దొంగిలించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు, ఏదైనా డ్యామేజీ, ఇతర దుర్ఘటనల వల్ల సంభవించే మరణం వంటి పరిస్థితుల నుంచి రక్షణ ఇస్తుంది. ప్రమాదం లేదా విపత్తు కారణంగా మోటారు వాహనానికి నష్టం వాటిల్లితే.. పాలసీదారు బీమా సంస్థను క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం అభ్యర్థించొచ్చు. పాలసీని ఎలా కొనుగోలు చేసినా ఈ క్లెయిమ్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కూడా చేయొచ్చు. అయితే వాహన బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ చేసేటప్పుడు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రమాద సమాచారం :వాహనానికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి నష్టానికి గురైతే లేట్ చేయకుండా బీమా సంస్థకు తెలియజేయాలి. వీలైనంత త్వరగా క్లెయిమ్ ఫైల్ చేయండి. ఈ పని చేసేటప్పుడు నిర్ణీత సమయం దాటితే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేస్తే సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫోటోలను తీసి వీడియోగా తయారు చేసుకోవడం మంచిది. క్లెయిమ్ సమయంలో బీమా సంస్థ వీటిని కోరొచ్చు.
బైక్, కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ మర్చిపోయారా? ఇలా చేయండి!
నెట్వర్క్ గ్యారేజ్ :ఒకసారి ప్రమాద సమాచారం అందించిన తర్వాత బీమా కంపెనీ నిర్దేశించిన విధంగా దెబ్బతిన్న కారుని సమీపంలోని నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకెళ్లొచ్చు. అక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ దరఖాస్తు ఫారంను తీసుకొని ఫిల్ చేయాలి. వాహనానికి ఎంత వరకు నష్టం జరిగిందని అంచనా వేయడానికి బీమా సంస్థ ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది. చివరిగా మీరు సర్వీస్ స్టేషన్ నుంచి రిపేర్ రసీదు పత్రాన్ని తీసుకోవాలి.