విదేశాల్లో చదువుకోవాలి.. చాలామంది విద్యార్థుల కల ఇది. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యాభ్యాసం ఖర్చుతో కూడుకున్నదే. ఈ వ్యయాన్ని భరించేందుకు పెట్టుబడులతో జమ చేసిన మొత్తంతో పాటు, విద్యారుణం తీసుకొని, తమ పిల్లల కలను నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో విద్యారుణం తీసుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పు భారం తొందరగా తీర్చేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
మన దేశం నుంచి వెళ్లి విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో విదేశీ ఉన్నత విద్య ఖర్చు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రామాణిక సంస్థలు ప్రకటించిన గణాంకాల ప్రకారం.. భారత విద్యార్థులు విదేశాల్లో చదువు కోసం ఖర్చు చేస్తున్న మొత్తం 28 బిలియన్ డాలర్ల మేరకు ఉంది. 2024 నాటికి ఇది 80 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. విదేశాల్లో చదువుకునే వారికి ఉపకార వేతనాల వంటివి ఉన్నప్పటికీ అనేకమంది విద్యార్థులు వీటికి అర్హులు కాలేరు. కాబట్టి, రుణం తీసుకోవడం కొన్నిసార్లు తప్పనిసరి అవుతోంది.
బ్యాంకులు అండగా..
దేశంలో, విదేశాల్లో వృత్తిపరమైన లేదా సాంకేతిక ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం.. భారతీయ రిజర్వు బ్యాంకు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌లతో కలిసి సమగ్ర రుణ పథకాన్ని రూపొందించింది. దీనిద్వారా కళాశాల, హాస్టల్, పరీక్ష, లేబొరేటరీ ఫీజులు, పుస్తకాల ఖర్చు, పరికరాలు, కాషన్ డిపాజిట్‌లతో పాటు అనుమతించిన మేరకు బిల్డింగ్ ఫండ్, రిఫండబుల్ డిపాజిట్ అవసరాలకు రుణం పొందవచ్చు.
ఈ పథకం ద్వారా దేశీయంగానే కాకుండా, విదేశాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు విద్యారుణాన్ని అందిస్తారు. మేనేజ్‌మెంట్ కోటా ద్వారా ప్రవేశం పొందిన వారికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో సహా మరికొన్ని బ్యాంకులూ విద్యారుణాలను అందిస్తున్నాయి. క్యాపిటేషన్ ఫీజు, డొనేషన్ ఖర్చుల కోసం అప్పు రాదు.
రూ.50 లక్షల వరకూ..
ప్రస్తుతం విద్యారుణాల కోసం క్రెడిట్ గ్యారంటీ నిధుల ద్వారా రూ. 7.50 లక్షల రుణం ఎటువంటి పూచీకత్తు లేకుండా పొందవచ్చు. త్వరలోనే ఈ పరిమితిని రూ.10లక్షల వరకూ పెంచే ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహా కొన్ని ఇతర బ్యాంకులు ఎంపిక చేసిన కళాశాలల్లో చేరే విద్యార్థులకు రూ.40 లక్షల నుంచి రూ.50లక్షల వరకూ ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలను ఇస్తున్నాయి.
ఏయే పత్రాలు..
రుణం తీసుకునేందుకు అవసరమైన పత్రాల విషయానికి వస్తే..
- మీ విద్యాభ్యాసానికి సంబంధించిన సర్టిఫికెట్లు, ప్రవేశ పరీక్ష ఫలితాలు
- అడ్మిషన్ లెటర్
- విదేశాల్లో చదువుకోవాలనుకున్నప్పుడు 'ఐ 20'
- కాలేజీ నుంచి వచ్చిన ఫీజుల వివరాలు
- మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణలు (సహ దరఖాస్తుదారు/హామీదారులవీ)
- విద్యార్థులకు పాన్ కార్డు తప్పనిసరి (మైనర్లకూ ఇది వర్తిస్తుంది)
- ఆదాయపు పన్ను రిటర్నులు
- తనఖా అవసరమైనప్పుడు.. ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలు
- ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం వర్తించే వారికి ఆధార్ తప్పనిసరి.
సరిపోకపోతే..
కొన్నిసార్లు.. అవసరమైన మేరకు విద్యారుణం రాకపోయే ఆస్కారం ఉంది. ఇలాంటప్పుడు తనఖా రుణాల కోసం ప్రయత్నం చేయాలి. మీరు హామీగా చూపించే ఆస్తి మార్కెట్ విలువ, తిరిగి చెల్లించే వ్యవధిని బట్టి రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది. విద్యారుణంతో పోలిస్తే బ్యాంకులకు ఇది సురక్షిత రుణం. కాబట్టి, తక్కువ వడ్డీతో, అధిక రుణాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.