How To Plan For Retirement :దేశంలో అధిక శాతం యువత పదవీ విరమణ లక్ష్యాలపై అంతగా దృష్టి సారించడం లేదని ఓ బ్యాంక్ నిర్వహించిన సర్వే ఆధారంగా వెల్లడైంది. 30 ఏళ్ల వయసు రాకముందే పదవీ విరమణ ప్రణాళిక గురించి ఆలోచన చేయాలని సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా చాలా మంది తమ వార్షిక ఆదాయానికి 10 రెట్ల నిధి రిటైర్‌మెంట్ తర్వాతి అవసరాలకు సరిపోతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రిటైర్‌మెంట్ ప్లాన్ గురించి చిన్న వయసులోనే సీరియస్‌గా ఆలోచించాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అసలు రిటైర్‌మెంట్ ప్రణాళిక ఎప్పటి నుంచి మొదలుపెట్టాలి? ఏఏ వయసులో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వీటిని సాకుగా చూపకండి..
Retirement Plan :ప్రస్తుతం ఉండే ఆర్థిక అవసరాలు చాలా మందికి రిటైర్‌మెంట్ ప్లానింగ్ అడ్డంకిగా మారుతుంటాయి. నెలనెలా వచ్చే ఆదాయంలో అధిక శాతం లోన్ ఈఎంఐలకు, కార్లు, ఇల్లు, విద్యా రుణం ఇలా రకరకాల లోన్స్ కట్టాడానికే సరిపోతుంది. దీంతో పదవీ విరమణకు కావాల్సిన డబ్బును దాచుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొందరైతే ఉద్యోగ భవిష్య నిధి నుంచి కూడా డబ్బును తీసుకొని తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే, ఇవేవీ పదవీ విరమణ లక్ష్యాలకు అడ్డంకిగా మారకుండా చూసుకోవాలి.
ఎంత కావాలి?
Retirement Goals :పదవీ విరమణ తర్వాత జీవితం సాఫీగా సాగడానికి ఎంత మొత్తం నిధి అవసరం పడుతుందో చాలా మంది అంచనా వేయలేక పోతున్నారు. రిటైర్‌మెంట్‌కు ఇంకా కొన్ని దశాబ్దాల సమయం ఉన్నవారు తమ వార్షిక ఆదాయానికి కనీసం 30 రెట్ల సొమ్మును దాచి ఉంచుకోవాలని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఉదాహరణకు మీ నెలవారీ ఖర్చులు రూ.లక్ష అనుకుంటే.. ఏడాదికి రూ.12 లక్షల చొప్పున మీరు రూ.3.6 కోట్ల నిధిని రిటైర్‌మెంట్ తర్వాత జీవితం కోసం పోగు చేసుకోవాల్సి ఉంటుంది.
చిన్నవయసులోనే ప్రారంభించండి..
మీ రిటైర్‌మెంట్ లక్ష్యం ఏంటో 20 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకోవడం ఉత్తమం. దాన్ని చేరుకోవాలంటే ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలో ఒక అంచనాకు రావాలి. ప్రతి నెలా కొంత మొత్తం పక్కకు తీసి మదుపు చేస్తే కాంపౌండింగ్ పద్ధతి ద్వారా భారీ మొత్తంలో నిధిని ఆదా చేసుకోవచ్చు. పైగా తక్కువ వయసులోనే ఈ ప్రక్రియ మొదలుపెడితే ఈక్విటీల లాంటి రిస్క్ ఉండే ఆర్థిక సాధనాల్లోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీంతో మీ రాబడిని కూడా సులువుగా పెంచుకోవచ్చు.
ఆరోగ్య బీమా తప్పనిసరి..
అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా పాలసీలను కచ్చితంగా తీసుకోవాలి. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే మీ రిటైర్‌మెంట్ ప్లాన్‌కు ఢోకా తగులుతుంది. అలాగే కనీసం ఆరునెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్‌ను వేరేగా జమచేసుకోవాలి.