తెలంగాణ

telangana

ETV Bharat / business

అప్పుల భారం తగ్గించుకుందాం ఇలా..

ఓ వైపు సంపాదన పెరుగుతోంది. మరోవైపు అదే స్థాయిలో ఖర్చులూ అధికంగానే ఉంటున్నాయి. ఇల్లు, కారు, మొబైల్‌ ఫోన్‌... ఇలా ఏది కొనాలన్నా అప్పు చేయక తప్పట్లేదు. ఇతర అవసరాలకూ వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డుల వాడకం నానాటికి పెరిగిపోతోంది. దీంతో తమకు తెలియకుండానే చాలామంది ఈ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరి దీని నుంచి త్వరగా బయటపడేందుకు ఏం చేయాలి?

loan apps emi
how to overcome debt

By

Published : Oct 21, 2022, 7:13 PM IST

అవసరం ఏమిటన్నది చూడకుండా అప్పు ఇచ్చే సంస్థలు ఇప్పుడు బోలెడు. వాళ్లు ఇస్తున్నారు కదా అని మనం తీసుకుంటే.. తర్వాత అది మనకు గుదిబండగా మారుతుందనడంలో సందేహం లేదు. అందుకే, అప్పు తీసుకునేటప్పుడు మొదలు.. దాని చివరి వాయిదాలు చెల్లించేదాకా జాగ్రత్తగానే ఉండాలి.
ఉదాహరణకు ఇప్పుడు గృహరుణం మీద 8.40-8.65 శాతం వడ్డీ విధిస్తున్నారు.

రెపో రేటు 4 శాతం ఉన్నప్పుడు ఈ రేటు 7 శాతం లోపే. దీంతో చాలామందికి గృహరుణ అర్హత పెరిగింది. ఇచ్చినంత మొత్తాన్ని తీసుకున్నారు. ఇప్పుడు వడ్డీ రేటు పెరగడంతో ఈఎంఐ భారం లేకున్నా.. వ్యవధి కొన్నేళ్లపాటు అధికమయ్యింది. అంతే, రుణ భారం పెరిగినట్లే కదా. అందుకే, అప్పు తీసుకునేటప్పుడు భవిష్యత్తులో వడ్డీ రేటు పెరిగితే ఎలా అనేదీ ఆలోచించాలి.

40-50 శాతం మించకుండా..
సరైన ప్రణాళికలు ఉంటేనే అప్పులను నిర్వహించడం సులభం అవుతుంది. అధిక మొత్తంలో అప్పు ఇస్తున్నప్పటికీ మనకు ఎంత అవసరమో అంతే తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక సూత్రాల ప్రకారం ఒక వ్యక్తి తన ఆదాయంలో 40-50శాతానికి మించి అప్పుల వాయిదాలు చెల్లించకూడదు. 40 శాతం లోపు ఉండటం ఇంకా మంచిది. ఈ పరిమితి దాటితే వాయిదాలు కట్టడంలో ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది. అప్పుల వాయిదాలు బాగా పెరిగితే ఇతర ఖర్చులకు రాజీ పడాల్సి వస్తుంది. ఆదాయం పెరుగుతుందని ఊహించకుండా.. ఇప్పుడున్న ఆదాయంలో 40 శాతం ఈఎంఐకి ఎంత మేరకు అప్పు తీసుకుంటే బాగుంటుందో చూసుకోండి. పరిమితిని దాటనీయకండి.

చెల్లింపులను పెంచండి..
అధిక వడ్డీ రేటుతో వచ్చే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డుల వల్ల అప్పటికప్పుడు అవసరాలు తీరిపోతాయి. కానీ, ఈ అప్పులు ఎక్కువ సమయం కొనసాగించడం మంచిది కాదు. క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు అధికంగా ఉంటే, ఖర్చులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నమాట. తక్కువ పరిమితితో ఉన్న క్రెడిట్‌ కార్డును మాత్రమే వాడండి. ఎక్కువ బాకీ ఉండి, కనీస మొత్తం చెల్లిస్తూ ఉన్నవాటిని తొందరగా తీర్చే ఏర్పాటు చేసుకోవాలి. అప్పులు తొందరగా తీరాలంటే వాయిదా మొత్తాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. గృహరుణానికి ఏడాదికి కనీసం నాలుగు ఈఎంఐలైనా అధికంగా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి.

క్రమం తప్పకుండా..
రుణ వాయిదాలను ఆలస్యం చేయకుండా చెల్లించడం ఎప్పుడూ ముఖ్యం. సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుములు భారీగా ఉంటాయి. ఇలా తరచూ జరుగుతుంటే సిబిల్‌ స్కోరుపైనా ప్రభావం పడుతుంది. మీరు చెల్లించే రుణ వాయిదాలే కాదు.. కరెంటు, ఫోన్‌, ఇతర బిల్లులనూ గడువులోపు చెల్లించే అలవాటు చేసుకోండి. లేకపోతే అపరాధ రుసుమలు తప్పవు. చిన్న మొత్తాలే అనుకొని నిర్లక్ష్యం చేయొద్దు.

ఖర్చులకు కళ్లెం వేస్తేనే..
అనవసరమైన విలాసాలు తగ్గించుకోవాలి. అప్పుడే కోరుకున్న ఆర్థిక స్థాయికి వెళ్లగలం. కుటుంబమంతా కలిసి ఆర్థిక ప్రణాళికలను రచించుకోవాలి. వాటిని విపులంగా చర్చించి, ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అప్పుల నుంచి త్వరగా బయటపడే మార్గాలను అన్వేషించాలి. వాటిని ఆచరణలో పెట్టేలా క్రమశిక్షణ పాటించాలి. అప్పులు తొందరగా తీరితే.. ఆ మేరకు వాయిదాల భారం తగ్గుతుంది. ఖర్చులు పెట్టుకునేందుకు కాస్త వెసులుబాటూ దొరుకుతుంది. కాబట్టి, అధికంగా ఖర్చు చేస్తూ.. వడ్డీ భారం మోయడం కన్నా.. ముందుగా అప్పులు చెల్లించి, మిగులు మొత్తాన్ని వాడుకోవడం ఉత్తమం.

ఇదీ చదవండి:నో కాస్ట్ ఈఎంఐతో వస్తువులు కొంటున్నారా? ఇవి తెలుసుకోండి!

'530 కోట్ల ఫోన్లు పక్కన పడేస్తారు.. రీసైక్లింగ్​కు కొన్నే'.. WEEE నివేదిక

ABOUT THE AUTHOR

...view details