How To Make A Good Retirement Plan : పదవీ విరమణ వయసు వచ్చే సరికి అందరూ ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటారు. కానీ, ఇది ఆచరణలో సాధ్యం కావాలంటే సరైన ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. అయితే మనం వృద్ధాప్యంలో ఎటువంటి ఆర్థిక లోటు లేకుండా జీవించేందుకు చిన్న వయస్సులోనే సంపాదించి పెట్టుకోవాలి. ఇది అందరికి తెలిసిన విషయమే అయినా.. కొంత అవగాహన లేమి కారణంగా చాలా మంది రిటైర్మెంట్ ప్లాన్‌ను సరైన మార్గంలో నిర్మించుకోలేకపోతున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఆరోగ్య సమస్యలు జీవితాంతం దాచుకున్న పొదుపును హరించివేస్తాయి. అందుకే, సరైన పదవీ విరమణ ప్రణాళిక ప్రతి ఒక్కరికి అవసరం. అయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ.. చక్కటి ఆర్థిక ప్రణాళికను సృష్టించుకోవాలంటే ఈ కింది విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి.
చిన్నవయసులోనే చేయాలి..
Good Retirement Plans In India : డబ్బును కేవలం ఆదా చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. దాచిన సొమ్మును మంచి రిటర్న్స్ ఇచ్చే పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మనం రిటైర్ అయ్యేలోపు లంప్సమ్గా అమౌంట్‌ను అందుకుంటాము. ఇందుకోసం ఈ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు సరైన సమయం ఇవ్వాలి. అంటే ఇక్కడ డబ్బుతో పాటు, కాలాన్ని కూడా మీరు మదుపు చేయాలి. చిన్న వయసు నుంచే మదుపు ప్రారంభం కావాలి. అప్పుడే అసలుపై వడ్డీ.. దానిపై చక్రవడ్డీ ఇలా ఒక మంచి నిధి ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంటుంది.
కాస్త రిస్క్ తీసుకుంటే..
Retirement Savings Plan : పెట్టుబడి అంటేనే రిస్క్‌తో కూడుకున్నది. అయితే సంప్రదాయ పెట్టుబడి మార్గాల్లో మదుపు చేస్తే గనుక దీని నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ రకమైన సాధనాల్లో అసలు, రాబడికి హామీ ఉంటుంది. కానీ, ఇవి ద్రవ్యోల్బణం నుంచి మనల్ని కాపాడలేకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకునేది జీవిత బీమా సంస్థలు అందించే యూనిట్ ఆధారిత బీమా పాలసీల (యులిప్) గురించి. ఇవి ఇన్వెస్టర్‌కు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని ఇస్తుంది. అందుకే ఈక్విటీ మార్కెట్ల నుంచి దూరంగా ఉండకూడదు. సంపదను పెంచుకోవాలంటే వీటిలో పెట్టుబడి ఎంతో అవసరం. అధిక నష్టభయాన్ని భరించగలిగితే నేరుగా ఈక్విటీ మార్కెట్లో మదుపు చేయవచ్చు. తక్కువ నష్టభయంతో ఈక్విటీల్లో మదుపు చేయాలనుకుంటే.. యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్ ఫథకాలను ఎంచుకొని, పరోక్ష పెట్టుబడులు పెట్టండి. అయితే వీటిల్లో ప్రవేశించేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, నష్టభయం భరించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం ఉత్తమం.