తెలంగాణ

telangana

ETV Bharat / business

Investment For Child Education: చిన్నారుల బంగారు భవితకు.. ఈ ఆర్థిక సూత్రాలతో భరోసా!

Child Education Plan : నేటి ఆధునిక జీవితంలో విద్య అనేది అంగట్లో సరకుగా మారిపోయింది. చదువుకునే రోజులు పోయి, చదువు కొనుక్కునే రోజులు వచ్చేశాయి. దీనికి తగ్గట్లు ఏటా పాఠశాల, కళాశాల ఫీజులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ చిన్నారుల భవితకు తగిన భరోసా కల్పించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. అది ఎలాగో చూద్దాం రండి.

Child Education Plan
How To Keep Your Children Future Financially Secure

By

Published : Jul 21, 2023, 4:51 PM IST

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలని ఆశిస్తారు. అందుకోసం, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కోరుకుంటారు. ఇందుకోసం తమ శక్తికి మించి ఖర్చు చేయడానికి కూడా వెనుదీయరు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే, కచ్చితంగా ఈ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి!
Long term investment plans : ఆర్థిక పెట్టుబడులు ఎప్పుడు దీర్ఘకాలిక లక్ష్యంతో ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంపౌండింగ్​ ఎఫెక్ట్​ అనేది పనిచేస్తుంది. అదే సమయంలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాట్లు సైతం మీ ఆర్థిక లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సాధారణంగా పెట్టుబడుల్లో చేసే పొరపాట్లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.

బీమాను విస్మరించవద్దు!
Insurance policy investment : నేటి ఉరుకులపరుగుల జీవితంలో ఎప్పుడు ఏం అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుకే అనుకోని దుర్ఘటనలు జరిగినా కూడా, కుటుంబం ఎలాంటి ఆర్థిక ఒడుదొడుకులకు లోనుకాకుండాజీవితబీమా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల చదువులపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా బీమా పాలసీతో రక్షణ కల్పించాలి. దీనితో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా, డిజేబిలిటీ ఇన్సూరెన్స్​ లాంటివి తీసుకోవాలి. అప్పుడే పిల్లల చదువుల కోసం, భవిత కోసం దాచుకున్న సొమ్ము ఆసుపత్రులపాలు కాకుండా ఉంటుంది.

లక్ష్యాలను గుర్తుంచుకోవాలి!
Objectives of investment : సాధారణంగా ఒక లక్ష్యం కోసం దాచుకున్న సొమ్మును, ఇతర అవసరాల కోసం వాడేస్తూ ఉంటాం. కానీ ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. ఇంకా పిల్లలు పెద్దవాళ్లు కావడానికి ఐదు, పదేళ్లు ఉన్నాయి కదా.. అని ఆలోచించకూడదు. ఎందుకంటే ఒకసారి ఖర్చు చేసిన డబ్బును తిరిగి జమ చేయడం అనేది అంత సులువైన పనికాదు. పైగా చక్రవడ్డీ ప్రయోజనం దూరమవుతుంది. అందువల్ల పెట్టుబడి ప్రాధాన్యాలను ఎప్పుడూ విస్మరించకూడదు. మరీ ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో ఎలాంటి అశ్రద్ధ చూపకూడదు.

ఆలస్యం చేయవద్దు!
Early investment opportunities : నేటి కాలంలో పెట్టుబడులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలి. అలాగే వాటిని దీర్ఘకాలంపాటు కొనసాగించాలి. మరీ ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో ఇది చాలా కచ్చితంగా పాటించాలి. ఒక వేళ పెట్టుబడులు పెట్టడం ఆలస్యమైతే, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు కూడా.

ఉదాహరణకు బిడ్డ పుట్టిన వెంటనే, నెలకు రూ.10 వేలు చొప్పున ఈక్విటీ మ్యూచువల్​ ఫండ్లలో మదుపు చేస్తూ ఉంటే, 15 శాతం రాబడి అంచనాతో 20 ఏళ్లకు రూ.1.3 కోట్ల వరకు నిధి జమ అవుతుంది. అదే మీరు మీ పెట్టుబడిని 5 ఏళ్లు ఆలస్యం చేశారనుకోండి. అప్పుడు మీ చిన్నారి వయస్సు 20 ఏళ్లు వచ్చే సరికి కేవలం రూ.61.73 లక్షలు మాత్రమే జమ అవుతాయి. అంటే ఇక్కడ మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం వల్ల కాంపౌండింగ్​ ఎఫెక్ట్​ను పొందలేకపోయారని అర్థం చేసుకోవాలి.

ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా..
Investment against inflation : నేటి కాలంలో విద్యా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. దీని వల్ల సామాన్యులు ఉన్నత విద్యా ఖర్చులు భరించలేని పరిస్థితి ఎదురవుతోంది. కనుక పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మీ పెట్టుబడులుసర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలి!
Investment diversification strategy : ఒకే దగ్గర మొత్తం పెట్టుబడులు పెట్టకూడదు. పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. బ్యాంకు ఫిక్స్​డ్​ డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్​ ఫండ్స్​, బంగారం లాంటి భిన్నమైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలి. మొత్తం పెట్టుబడిలో కనీసం 70 శాతం వరకు ఈక్విటీ ఆధారిత పథకాలకు కేటాయించాలి. మిగతా మొత్తాన్ని సురక్షిత పథకాల్లో మదుపు చేయాలి. అలాగే ఎప్పటికప్పుడు మార్కెట్​ ట్రెండ్​కు అనుగుణంగా మీ పోర్టుఫోలియో మార్పులు, చేర్పులు చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు నష్టభయం నుంచి తప్పించుకోగలరు.

ABOUT THE AUTHOR

...view details