How To Improve Credit Score In 2024 : ఈ రోజుల్లో సిబిల్ స్కోరు అనేది కేవలం రుణాలు పొందడానికే మాత్రమే కాదు, వ్యక్తి ఆర్థిక పరిస్థితిని అంచనావేయటానికి ఉపయోగిస్తున్నారు. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే ఏదైనా అత్యవసర పరిస్థితిల్లో వెంటనే ఆర్థిక సాయం దొరుకుతుంది. బ్యాంకులు మంచి సిబిల్ స్కోర్ ఉన్న వారికి త్వరగా రుణాలు మంజూరు చేస్తుంటాయి. సాధారణంగా క్రెడిట్/ సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచి స్కోరుగా పరిగణిస్తారు. దానికంటే తక్కువ ఉంటే రుణాలు పొందటం కొంచెం కష్టం అవుతుంది. అందుకే సిబిల్ స్కోరు పెంచుకోవడానికి అందరూ ప్రయత్నిస్తారు. మరి మీరూ మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కింద తెలిపిన టాప్-5 టిప్స్‌పై ఓ లుక్కేయండి.
1. పాక్షిక చెల్లింపులు వద్దు
మీరు క్రెడిట్ కార్డు బిల్లలను పూర్తిగా చెల్లించాలి. కానీ చాలా మంది పాక్షిక చెల్లింపులు చేస్తుంటారు. ఇది సరైన విధానం కాదు. పాక్షిక చెల్లింపులు చేస్తూ ఉంటే, మీకు తెలియకుండానే బకాయిలు అధికం అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని సకాలంలో చెల్లించకుంటే, అధిక వడ్డీలు, ఆలస్య రుసుములు చెల్లించాల్సి వస్తుంది. పైగా ఇది మీ క్రెడిట్ స్కోరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందువల్ల వీలైనంత వరకు పాక్షిక చెల్లింపులు చేయకపోవడమే మంచిది.
2. బిల్లులు సకాలంలో చెల్లించాలి
ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డు బిల్లులను వాయిదా వేయకండి. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నట్లయితే, బిల్ కట్టాల్సిన తేదీలను గుర్తుంచుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. కనుక ఆటోమేటిక్‌గా బిల్ పేమెంట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. దీని వల్ల సకాలంలో బిల్ పేమెంట్స్ జరిగిపోతాయి. ఫలితంగా అధిక వడ్డీలు, ఆలస్య రుసుముల నుంచి తప్పించుకోవచ్చు. పైగా మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.
3. అవసరం మేరకే వాడాలి
మీకేదైనా అత్యవసర పరిస్థితి ఉండి, తప్పనిసరిగా వాడాల్సి వస్తేనే క్రెడిట్ కార్డు ఉపయోగించండి. ఎందుకంటే ఈ రోజుల్లో అప్పు దొరకటం చాలా సులభమే. కానీ దానిని తిరిగి చెల్లించడం కష్టమవుతోంది. అందువల్ల మన అవసరాలకు తగిన విధంగానే క్రెడిట్ కార్డును ఉపయోగించాలి. మన శక్తికి మంచి అప్పు తీసుకుంటే, చెల్లించేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అంతేకాదు సరైన సమయంలో చెల్లింపులు చేయకుంటే, అది మీ సిబిల్ స్కోర్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.