How To Improve Credit Score : క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక పరిస్థితికి, క్రమశిక్షణకు, అప్పు తీర్చగలిగే సామర్థ్యానికి ఒక కొలమానం లాంటిది. అయితే కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల మీ క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ తగ్గవచ్చు. అయితే దీనికోసం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మంచి క్రెడిట్ స్కోర్‌ను సాధించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం!
ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే.. కచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. వాస్తవానికి క్రెడిట్ స్కోర్ అనేది అప్పటికప్పుడు తగ్గిపోవడం అంటూ జరగదు. మీ రుణ వాయిదాలను, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం వల్ల మీ సిబిల్ స్కోర్ అనివార్యంగా తగ్గుతుంది. అదే మీరు సకాలంలో ఈఎంఐలను, క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లిస్తూ ఉంటే.. కచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
స్కోర్ పెరగాలంటే..
క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.. రుణాలను సకాలంలో చెల్లించడమే. ఒక వేళ మీకు అధిక సంఖ్యలో రుణాలు లేదా క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే.. వాటన్నింటిని ఒకే దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నం చేయాలి. దీని వల్ల రుణాల సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా సులభంగా వాటిని తీర్చేందుకు వీలవుతుంది. మీకు గనుక ఈ ఆలోచన ఉంటే.. వెంటనే బ్యాంకులను సంప్రదించండి.
పరిమితికి మించి వాడకూడదు!
క్రెడిట్ కార్డు వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడకుండా జాగ్రత్తపడాలి. తీసుకున్న క్రెడిట్‌ను సకాలంలో చెల్లించాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
అనవసర ఖర్చులు పెట్టకూడదు!
చాలా మంది అవసరం లేకున్నా అప్పులు తీసుకోవడం, క్రెడిట్ కార్డులను వాడడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఒక వేళ అనవసర రుణాలు చేస్తే.. అప్పుల ఊబిలో చిక్కుకుపోవడం గ్యారెంటీ!