How To Get Rental Income Without Buying Property :ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి కేవలం తను చేసే ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం పైనే కాకుండా వివిధ ఆదాయ వనరులపై కూడా ఆధారపడుతున్నాడు. ఇందుకోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక పెట్టుబడి మార్గాల్లో మదుపు చేస్తుంటారు. అయితే ఎన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉన్నా సరే.. అవి కొన్నేళ్ల తర్వాత కాలం చెల్లుతాయి. అయితే వీటికి భిన్నంగా ఓ అద్భుతమైన మదుపు పద్ధతి అందుబాటులోకి ఉంది. దీని ద్వారా మీరు ఆస్తులు కొనకుండానే నెలనెలా ఓ నిర్దిష్టమైన అద్దె ఆదాయాన్ని పొందవచ్చు. అదే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(REIT) ప్లాన్. తక్కువ రిస్క్‌తో కూడుకున్న ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
REIT అంటే ఏమిటి..?
What Is Real Estate Investment Trust :రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(REIT).. అనేది ఓ పెట్టుబడి మార్గం. ఇది మీ ఆదాయాన్ని పెంచే ఓ రియల్ ఎస్టేట్ సాధనం. దీని ద్వారా మీరు ప్రతినెలా ఓ కచ్చితమైన అద్దె ఆదాయాన్ని పొందవచ్చు. దీంతో మీరు సాధారణంగా ఉద్యోగం ద్వారా పొందే ఆదాయానికి అదనంగా సంపాదించుకోవచ్చు. REIT ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. మదుపరులు నేరుగా ఆస్తులను కొనుగోలు చేయకుండానే వాటిపై పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయించడం. తద్వారా తక్కువ రిస్క్‌తో కూడిన నిరంతర ఆదాయాన్ని పొందడం.
తక్కువ రిస్క్.. ఎక్కువ రాబడి..
REITs In India Returns :ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి REIT పద్ధతి అనేది ఒక చక్కని ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌గా సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఏదైనా REITలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునే ముందు ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించడమే కాకుండా మార్కెట్ నిపుణుల సూచనలు తీసుకుంటే ఉత్తమమైన ఫలితాలను పొందగలరు. REITలో మదుపు చేసే సమయంలో వీటిని నిర్వహించే ఎక్స్‌పర్ట్స్‌తో మంచి సత్సంబంధాలను కలిగి ఉండాలి. అలాగే వీటికి సంబంధించి ట్రాక్ రికార్డులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పెట్టుబడి వ్యూహం అనుసరించాలో అనే అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. వీటితో పాటు మీ సొంత పెట్టుబడి లక్ష్యాలను, రిస్క్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో REIT అనేది సొంతంగా ఆస్తులను కొనుగోలు చేసి వాటిని నిర్వహించే పనిలేకుండా, క్రమం తప్పకుండా అద్దె ఆదాయం రావాలనుకునే వారికి ఓ బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.
ఆస్తులపై ఎవరికి హక్కులుంటాయి..?
- REITలు పెట్టుబడిదారులను చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టేందుకు కూడా అనుమతిస్తాయి. అలాగే ట్రేడింగ్ చేసుకునే అవకాశం కూడా ఈ పద్ధతిలో ఉంటుంది.
- ఈ పెట్టుబడి పద్ధతిలో సదరు ప్రాపర్టీకి సంబంధించి పూర్తి నిర్వహణ బాధ్యతలను మార్కెట్ నిపుణులు చూసుకుంటారు. అయినా సరే వాటిపై మీరు పూర్తి యాజమాన్య హక్కులను కలిగి ఉంటారు.
REIT ఎలా పని చేస్తుంది?
How Does REITs Work : REIT అనేది రియల్ ఎస్టేట్ ఆస్తుల సమూహం నుంచి ఓ కచ్చితమైన ఆదాయాన్ని సృష్టిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే వీటిని మ్యూచువల్ ఫండ్స్ లాగే నిర్వహిస్తారు. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి వాటిని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడుతుంది. ఇదే విధంగా REIT కూడా రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి రియల్ ఎస్టేట్ ఆస్తులలో పెట్టుబడిగా పెడుతుంది. సాధారణంగా ఈ REITల్లో వాణిజ్య రియల్ ఎస్టేట్ ఆస్తులైన కార్యాలయ స్థలాలు, వ్యాపార పార్కులు, షాపింగ్ మాల్స్ వంటివి ఉంటాయి. వీటి ద్వారానే మీరు క్రమం తప్పకుండా నెలనెలా అద్దె ఆదాయాన్ని పొందుతారు. వాస్తవానికి మనం బయటకు వెళ్లి నేరుగా ఆస్తులను కొనుగోలు చేయకుండా, REITలకు చెందిన స్టాక్‌హోల్డర్లే మన తరఫున రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్‌లో పెట్టుబడి పెడతారు. తద్వారా వాటిపై వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని మనకి అందిస్తారు. కాగా, కంపెనీ ఆర్జించే అద్దె ఆదాయం నుంచి REITల్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు డివిడెండ్ల రూపంలో తమ రెగ్యులర్ ఇన్కమ్ అందుతుంది.