తెలంగాణ

telangana

ETV Bharat / business

అర్జెంట్​గా లోన్ కావాలా? మీ LIC పాలసీపై తక్కువ వడ్డీకే రుణం పొందండిలా! - ఎల్​ఐసీ పాలసీపై లోన్ తీసుకోవచ్చా

How To Get Loan Against LIC Policy In Telugu : మీకు అత్యవసరంగా రుణం కావాలా? క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? అయితే ఇది మీ కోసమే. మీరు ఎల్​ఐసీ పాలసీదారులు అయ్యుంటే చాలు. మీకు చాలా సులువుగా, తక్కువ వడ్డీ రేటుతో లోన్ లభిస్తుంది. మరి దీనికి అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తదితర పూర్తి వివరాలు మీ కోసం.

LIC loan eligibility criteria
How To Get Loan Against LIC Policy

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 7:23 AM IST

How To Get Loan Against LIC Policy : భారతీయులు ఎంతో కాలంగా నమ్ముతున్న సంస్థల్లో ఎల్ఐసీ ఒకటి. చాలా మందికి ఎల్ఐసీ పాలసీ ఉంటుంది. అయితే ఎల్ఐసీ పాలసీ ఉన్న వాళ్లు, అదే పాలసీ మీద అవసరాలకు అనుగుణంగా లోన్లు తీసుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఎల్​ఐసీ పాలసీదారులు తమ పాలసీపై లోన్లు ఎలా తీసుకోవాలి? రుణార్హతలు ఏమిటి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్ఐసీ పాలసీపై లోన్లు
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్బంలో, ఎప్పుడో ఒకసారి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం సహజం. ఇంటి అవసరాలు, ఆసుపత్రి ఖర్చులు, పిల్లల చదువుల కోసం, ఇలా ఏదో ఒక సందర్భంలో అప్ఫు చేయడం తప్పనిసరి అవుతుంది. అలాంటి సమయాల్లో ముందుగా గుర్తొచ్చేది వడ్డీ వ్యాపారులు. ఆ తర్వాత బ్యాంకులు, బంగారు ఆభరణాలపై రుణాలు.

వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకోవడం చాలా ప్రమాదం. ఎందుకంటే, ఎక్కువ వడ్డీ వల్ల మన శ్రమ అంతా ధారబోసినా వారి అప్పులు తీర్చడం చాలా కష్టమవుతుంది. ఇక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం అంత తేలికైన పనికాదు. ఎందుకంటే బ్యాంకులు అడిగిన వెంటనే రుణాలు ఇవ్వవు. పైగా సవాలక్ష నిబంధనలు చెప్పి, చాలా సమయాన్ని వృథా చేస్తాయి. ఇక బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ, వీటిన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఎల్ఐసీ లోన్లు. అయితే తక్కువ వడ్డీకి వచ్చే ఈ ఎల్ఐసీ లోన్లు గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం.

అర్హతలు
పాలసీ స్వాధీన విలువలో 90 శాతం వరకు రుణంగా ఇస్తుంది ఎల్ఐసీ. సాధారణంగా ఎల్​ఐసీ ఎండోమెంట్ పాలసీదారులకు మాత్రమే ఈ రుణాలకు అర్హత ఉంటుంది. ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తూ పాలసీ గడువు ముగిసేవరకు అసలు చెల్లించకుండా రుణాన్ని కొనసాగించొచ్చు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం నుంచి ఎల్ఐసీ రుణ మొత్తాన్ని మినహాయించుకుంటుంది. లేదా పాలసీదారుడు మరణిస్తే పరిహారం నుంచి ఆ మేరకు తగ్గించుకుంటుంది. ఒక వేళ వడ్డీ కూడా చెల్లించకుంటే, పాలసీని ముందే టెర్మినేట్ చేసే హక్కు ఎల్ఐసీకి ఉంటుంది.

ఎల్​ఐసీ నుంచి రుణం తీసుకోవాలంటే, పాలసీ తీసుకుని కనీసం మూడు సంవత్సరాలు అవ్వాలి. మీ ఇన్సూరెన్స్ పాలసీకి సరెండర్ వ్యాల్యూ ఉండాలి. పాలసీ బాండ్‎ను ఎల్ఐసీకి ఇవ్వాలి. ఇంకా అర్హత ఉంటే అదే పాలసీపై రెండో రుణం కూడా తీసుకునేందుకు వీలుంది. ఎల్ఐసీ కాకుండా ఇతర ఆర్థిక సంస్థల నుంచి సైతం బీమా పాలసీలపై రుణం తీసుకోవచ్చు. కాకపోతే ఎల్ఐసీ సరెండర్ విలువపై 90 శాతం వరకు రుణంగా ఇస్తే, ఇతర సంస్థలు ఇంతకంటే తక్కువ మొత్తాన్ని రుణంగా ఇస్తాయి.

దరఖాస్తు విధానం
ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​లలో ఎల్ఐసీ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసీ వెబ్​సైట్​లో ఆన్​లైన్​ సర్వీసెస్ కాలమ్​లో ఆన్​లైన్​ లోన్ ఆఫ్షన్ ఎంచుకోవాలి. మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడే రిక్సెస్ట్ ఫర్ ద లోన్ ఆఫ్షన్ కనిపిస్తుంది. కొత్తగా రుణం తీసుకోవాలనుకునే వారి కోసం మరో ఆప్షన్ కూడా ఈ పేజీలోనే కనిపిస్తుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే, ఎల్ఐసీ పాలసీదారుడి బ్యాంకు ఖాతాలో రుణం మొత్తం జమ అవుతుంది. అందుకే దీనికంటే ముందు ఎల్ఐసీకి ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలు సరిగా ఉన్నది లేనిదీ పరిశీలించాలి.

మీ ఏజెంటు ద్వారా కూడా ఎల్ఐసీ పాలసీపై రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే నేరుగా ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు అందజేయవచ్చు. ఏ విధానంలో దరఖాస్తు చేసినా, రుణం మాత్రం మీ బ్యాంకు అకౌంట్‎లోనే జమ చేస్తారు. మీరు లోన్​ను బ్యాంకు ద్వారా చెల్లించవచ్చు. లేదా ఎల్ఐసీ కార్యాలయానికి నేరుగా వెళ్లి అయినా చెల్లించవచ్చు.

సానుకూల అంశాలు
అత్యవసర సమయాల్లో వేగంగా రుణం పొందొచ్చు. పర్సనల్ లోన్ కంటే వడ్డీ రేటు చాలా తక్కువ. ఆన్​లైన్​లోనే చెల్లించే వెసులుబాటు ఉంటుంది. క్రెడిట్ స్కోర్‎తో అవసరం లేదు. ఏ ఇతర అర్హత పత్రాలను ఇవ్వాల్సిన పనిలేదు. అలాగే పాలసీదారుడు అకాల మరణం చెందితే, పాలసీ బెనిఫిట్స్​ను కుటుంబానికి అందజేస్తారు. రుణ మొత్తం జమచేసుకుని, మిగిలిన డబ్బు ఎంతైనా పాలసీదారుని కుటుంబానికి చెల్లిస్తుంది ఎల్ఐసీ.

ప్రతికూలతలు
ఎల్​ఐసీ అందించే రుణ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. పైగా పన్ను ప్రయోజనాలు కూడా ఉండవు. స్వాధీన విలువ ఆధారంగా రుణం మొత్తాన్ని నిర్ణయిస్తున్నందున, పాలసీ కొనుగోలు చేసిన మొదటి కొన్ని సంవత్సరాల వరకు ఎక్కువ డబ్బు అవసరం ఉంటే, కేవలం ఈ తరహా రుణంపై ఆధారపడి ధైర్యంగా ముందుకు వెళ్లలేం. కానీ అత్యవసర సమయాల్లో ఈ పాలసీ ఆధారిత రుణాలు అక్కరకు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

పెళ్లి చేసుకుంటున్నారా? వెడ్డింగ్​ ఇన్సూరెన్స్ మస్ట్​ - ఎందుకంటే?

క్రెడిట్‌ కార్డు బిల్లు భారంగా మారిందా? ఈ ఫెసిలిటీతో అన్నీ క్లియర్​!

ABOUT THE AUTHOR

...view details