Loan On Insurance Policy : ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అటు ఆరోగ్య, ఇటు ఆర్థిక నిపుణులు చెబుతారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థికంగా చితికిపోకుండా ఉంటామని సూచిస్తారు. దీంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. అందులో రుణం పొందడం కూడా ఒకటి. అవును.. ఏదైనా ఆర్థిక అత్యవసర సమయంలో రుణాలు పొందేందుకు జీవిత బీమా పాలసీలను తాకట్టు పెట్టవచ్చు. అయితే అన్ని పాలసీలను ఇలా తాకట్టు పెట్టలేరు. ఎండోమెంట్, మనీ బ్యాక్ లాంటి ప్లాన్లను మాత్రమే తాకట్టు పెట్టే అవకాశముంది. టర్మ్ ప్లాన్లు ఇందుకు ఉపయోగపడవు.
అలా చేస్తేనే రుణం వస్తుంది..
కొన్ని కంపెనీలు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సైతం రుణం మంజూరు చేస్తాయి. మరికొన్ని కంపెనీలు ఇందుకు నిరాకరిస్తాయి. రుణం మంజూరు చేయాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి బీమా సంస్థలు. మదుపరులు రుణం పొందాలంటే కనీసం మూడేళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. అలా అయితేనే వారు అర్హులు. 3 సంవత్సరాల కంటే తక్కువ కాలం పాలసీ ఉన్నట్లయితే వారిని అనర్హులుగా పరిగణిస్తారు. రుణం మంజూరు, లోన్ అమౌంట్ అనేది కంపెనీని బట్టి మారుతుంది. లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా సంబంధిత కంపెనీని సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి.
తక్కువ వడ్డీ రేట్లు..
Loan Against Life Insurance Policy : సాధారణంగా బీమా సంస్థలు పాలసీ సరెండర్ విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణాలు అందిస్తాయి. ఉదాహరణకి ఇన్వెస్టర్ రూ.10 లక్షల విలువైన పాలసీ తీసుకుంటే దాని సరెండర్ విలువ 3 లక్షలు. అందులో వారికి సుమారు రూ.2.4 నుంచి రూ.2.7 లక్షల వరకు రుణం లభిస్తుంది. దీనికి వడ్డీ రేట్లు సైతం ఆయా కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటాయి. సాధారణంగా ఇది 9 నుంచి 12 శాతం మధ్యలో ఉంటుంది. బీమా పాలసీల సాయంతో రుణాలు తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం వడ్డీ రేట్లు. అవును వ్యక్తిగత రుణంతో పోలిస్తే.. ఇక్కడ తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. అదే వ్యక్తిగత రుణంలో ఇవి 16 నుంచి 18 శాతం వరకు ఉంటుంది.
ఒక ఫారమ్ నింపితే సరి..
దీనికి తోడు రుణం పొందే విధానం (డాక్యుమెంటేషన్) సులభంగా ఉంటుంది. ఇన్వెస్టర్లు ఒక అప్లికేషన్ పత్రం నింపి దానికి వారి పాలసీ ఒరిజినల్ ఇన్సూరెన్స్ కాపీని జత చేసి ఇవ్వాలి. పెట్టుబడిదారులు ఒక్కసారి లోన్ తీసుకున్న తర్వాత.. పొందిన రుణం పాలసీపై ప్రీమియం చెల్లించడం కొనసాగించాలి. ప్రతి రుణం లాగే ఇక్కడ సైతం పాలసీ టర్మ్ లోపు తమ రుణాన్ని తిరిగి చెల్లించాలి. పాలసీదారులు రుణం చెల్లించే సమయంలో అసలుతో పాటు వడ్డీని సైతం చెల్లించవచ్చు. లేదా వడ్డీ మాత్రమే చెల్లించే సదుపాయం కూడా ఉంది. వడ్డీ మాత్రమే చెల్లించే సందర్భంలో.. సెటిల్మెంట్ సమయంలో క్లెయిమ్ మొత్తం నుంచి అసలు తీసేస్తారు.
పాలసీ మధ్యలో వ్యక్తి మరణిస్తే..?
Loan Protection Insurance : పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీదారులు ఏ కారణం చేతనైనా మరణిస్తే.. వారు వడ్డీ మాత్రమే చెల్లించినట్లయితే పెండింగ్ లోన్ అమౌంట్ మొత్తాన్ని సెటిల్మెంట్ నుంచి తీసేసి మిగతా డబ్బును నామినీకి చెల్లిస్తారు. వారు కనీసం వడ్డీని కూడా చెల్లించడంలో విఫలమైన పక్షంలో.. లోన్ అమౌంట్ నగదు విలువ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు పాలసీ ల్యాప్ అవుతుంది. కంపెనీలు పాలసీ సరెండర్ విలువ నుంచి లోన్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. రుణం తీసుకునే ముందు బీమా కంపెనీతో వడ్డీ రేట్లు, టర్మ్ చెల్లింపు సమయం వంటి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ సదుపాయాన్ని దీర్ఘకాలిక అవసరాల కోసం కాకుండా స్వల్పకాలిక ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి. అంతేకాకుండా.. బీమా కవరేజీ మీద ప్రభావం పడకుండా వీలైనంత త్వరగా రుణ మొత్తాన్ని చెల్లించే ప్రయత్నం చేయాలి.