How to Ensure the Lender is Genuine in Digital Loan: ఆర్థిక అవసరాల కోసం రుణం తీసుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణం. డిజిటల్ లోన్స్ అందుబాటులోకి రావడంతో.. ఒక్క క్లిక్‌తో క్షణాల్లోనే బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి. అయితే.. రుణదాతలు సరైన వాళ్లు కాకపోతే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నప్పుడు ఎక్కువ వడ్డీలు వసూలు చేయడం, లోన్ చెల్లించడం ఆలస్యమైతే రుణ గ్రహీతలను వేధించడం, వ్యక్తిగత డేటా చోరీ వంటి ప్రమాదాలు చాలానే ఉంటాయి. ఇవి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. అందుకే లోన్ యాప్‌లు, ఇతర ఆన్‌లైన్ లోన్లు తీసుకునే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Personal Loan Tips: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలియకపోతే అంతే!
గుర్తింపు ఉందా?మన దేశంలో అప్పులు ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆర్‌బీఐ గుర్తింపు పొంది ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థతో కలిసి పనిచేస్తుండాలి. ఇలా గుర్తింపు పొందని సంస్థలు అప్పులు ఇవ్వడానికి వీల్లేదు. డిజిటల్ రుణాలు తీసుకునేటప్పుడు ముందుగా ఆ సంస్థ, యాప్ ఆర్‌బీఐ గుర్తింపు పొందిందా లేదా అనేది చూసుకోండి. ధ్రువీకరణ సంఖ్య తదితరాలను రిజర్వు బ్యాంకు వెబ్‌సైటులో తనిఖీ చేసుకోవాలి. మనం రుణం తీసుకునేటప్పుడు ఆయా సంస్థలు మన పూర్తి వివరాలను (కేవైసీ) తీసుకుంటాయి. అలాగే, మనమూ రుణ సంస్థ గురించి ఆరా తీయాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
కస్టమర్ల రివ్యూను వెరిఫై చేయాలి: డిజిటల్ లెండర్ గురించి తెలుసుకోడానికి.. ఆన్‌లైన్ ఫోరమ్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, రివ్యూ వెబ్‌సైట్‌లలో కస్టమర్ రివ్యూలు అండ్ ఫీడ్‌బ్యాక్‌ను చూడండి. మునుపటి రుణగ్రహీతల నుంచి వచ్చే సానుకూల, ప్రతికూల రివ్యూలు.. రుణదాత సేవలపై కొంతమేర అవగాహనను అందిస్తాయి. కస్టమర్ల క్రెడిట్ యోగ్యతను పరిగణనలోకి తీసుకోకుండా ఆమోదాలకు హామీ ఇచ్చే యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే.. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని సదరు సంస్థ ప్రతినిధులు మిమ్మల్ని ఒత్తిడి చేస్తే.. మరింత జాగ్రత్తగా ఉండండి. నిజమైన రుణదాతలు తరచుగా వారి యాప్‌లో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను జాబితా చేస్తారు. అలాగే ఫిర్యాదుల పరిష్కార నిర్వాహకుని కోసం సంప్రదింపు వివరాలను అందిస్తారు.