ఒకసారి రుణం తీసుకుంటే.. వ్యవధిని మార్చుకోలేమని చాలామంది అనుకుంటారు. కానీ, మీ చెల్లింపుల చరిత్ర బాగుంటే.. బ్యాంకు/ఆర్థిక సంస్థలను మీరు వ్యవధి తగ్గింపు కోసం కోరవచ్చు. వ్యవధి తగ్గినప్పుడు ఈఎంఐ పెరుగుతుంది. రుణం తొందరగా తీరడంతో వడ్డీ భారం తగ్గుతుంది. మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఈఎంఐని పెంచుకునే విషయాన్ని ఆలోచించవచ్చు.
పాక్షిక చెల్లింపులు చేస్తూ రుణ అసలును తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. దీనివల్ల వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది. ఉదాహరణకు ఏడాదికి ఒకటి లేదా రెండు ఈఎంఐలు అదనంగా చెల్లించవచ్చు. అనుకోకుండా మీ చేతికి వచ్చిన డబ్బులను ఇందుకు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు బోనస్‌లు, మిగులు మొత్తంలాంటివి. కొన్ని రుణ సంస్థలు ఇలా పాక్షిక మొత్తాన్ని చెల్లించినందుకు కొంత రుసుము విధిస్తాయి. గృహరుణాలపై బ్యాంకులు సాధారణంగా ఎలాంటి రుసుములూ వసూలు చేయవు.
- అధిక వడ్డీ ఉన్న బ్యాంకు నుంచి ఇతర రుణ సంస్థకు మారేందుకు ప్రయత్నించవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కనీసం 0.75-1 శాతం వరకూ వడ్డీ రేటులో తేడా ఉన్నప్పుడే ఈ అంశాన్ని పరిశీలించాలి. కొత్త రుణదాత మీకు ఆకర్షణీయమైన వడ్డీ, ఇతర ఖర్చుల్లో రాయితీని అందిస్తుంటే మారేందుకు ప్రయత్నించవచ్చు. ఏది ఏమైనా సంస్థను మారే ముందు కచ్చితంగా ఖర్చులు-ప్రయోజనం తెలుసుకోవాలి. గృహరుణాలు దీర్ఘకాలం కొనసాగుతాయి కాబట్టి, స్వల్ప వడ్డీ రేటు తగ్గినా మిగులు ఎక్కువగానే ఉంటుంది.
- క్రెడిట్ స్కోరు అధికంగా ఉన్నవారికి వడ్డీ రేటులో రాయితీ లభిస్తుంది. మీ క్రెడిట్ స్కోరు పెరిగినప్పుడు బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయండి. ఏదైనా రాయితీ లభిస్తుందా తెలుసుకోండి.
- వడ్డీ ఎక్కువగా ఉన్న రుణాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. ఒకవేళ తీసుకున్నా వాటిని తొందరగా తీర్చేయాలి. చిన్న చిన్న అప్పులు అధికంగా ఉంటే వాటిని నిర్వహించడం కష్టం. వాటికి బదులుగా ఒక పెద్ద రుణానికి చెల్లించడం తేలిక.
- కొత్తగా రుణం తీసుకోబోయే ముందు.. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పడే భారాన్నీ పరిగణనలోకి తీసుకొని, రుణ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.