How To Choose Best Financial Advisor :ఎవరు అవునన్నా, కాదన్నా జీవితం అనేది డబ్బుతో ముడిపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మన దైనందిన కార్యకలాపాలు, సమస్యలు, పరిష్కారాలు అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అందుకే డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పొదుపు, పెట్టుబడుల విషయంలో కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.
ఆర్థిక నిర్వహణ
మన జీవితంలో వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అనేది చాలా ప్రధానమైనది. ఇది మన భవిష్యత్ భద్రతకు ఎంతో అవసరం. అయితే చాలా మంది ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక నిర్వహణకు సంబంధించిన విషయాలపై అజాగ్రత్తగా ఉంటారు. ఇది సరైన విధానం కాదు. మరికొందరికి ఆర్థిక ప్రణాళిక వేసుకునేంత పరిజ్ఞానం ఉండదు. దీనితో సరైన ప్రణాళిక లేకుండా, ఇష్టారీతిన ఖర్చులు చేసి, అవగాహన లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతుంటారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రకారం, ఇండియాలో కేవలం 27% మందికి మాత్రమే ఆర్థిక అక్షరాస్యత ఉంది. ఇందుకే ఆర్థిక అంశాలపై అవగాహన లేనివారందరూ సరైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం కోసం మంచి సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్‌ను ఎంచుకోవాలి.
ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చేస్తారు?
ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. మీరు సంపన్నులైనా, పేదవారైనా, చిన్న వయస్సులో ఉన్నా, పదవీ విరమణకు చేరువలో ఉన్నా, ఇంకా చెప్పాలంటే మీరు ఏ దశలో ఉన్నవారైనా, సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి.
ఉదాహరణకు, ఒక వృత్తి నిపుణుడు బాగా సంపాదిస్తూ ఉండవచ్చు. కానీ సంపాదించిన దాన్ని మేనేజ్ చేయడం అతనికి తెలియకపోవచ్చు. ఇలాంటి వారు ఫైనాన్షియల్ ప్లానర్ సలహా తీసుకుంటే, తమకు సరిపడే మంచి బడ్జెట్‌ను రూపొందించుకోవడానికి, తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం తగిన విధంగా పొదుపు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మీకు గనుక మంచి ఫైనాన్షియల్ ప్లానర్ తోడుగా ఉంటే, అతను తగిన వ్యూహాన్ని రచించి, పన్ను మినహాయింపులు లభించే పెట్టుబడి మార్గాలను కూడా తెలియజేస్తాడు.
మంచి ఫైనాన్షియల్ ప్లానర్‌ను ఎలా ఎంచుకోవాలి?
స్నేహితులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తుల ద్వారా మంచి ఆర్థిక సలహాదారుడిని సంప్రదించవచ్చు. నేడు ఆన్‌లైన్‌లోనూ మంచి ఆర్థిక సలహాదారులు అందుబాటులో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా నేడు ఆన్‌లైన్ రీసెర్చ్ ద్వారా సరైనా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ను చాలా సులభంగా గుర్తించవచ్చు. సోషల్ మీడియాలో వీరి ఇంటర్వ్యూలను చూసి, వీరి శక్తిసామర్థ్యాలను అంచనా వేసి, మీకు నచ్చిన ఆర్థిక సలహాదారుడుని ఎంపిక చేసుకోవచ్చు. కొంతమంది పేరున్న ఆర్థిక నిపుణులు రిఫరెన్స్‌ల ద్వారా మాత్రమే క్లయింట్స్‌ను తీసుకుంటారు.
అప్రమత్తంగా ఉండాలి!
నేడు ఆన్లైన్లో చాలా మంది నకిలీ ఆర్థిక నిపుణులు పుట్టుకొస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎవరినైనా మీ ఆర్థిక సలహాదారునిగా ఎంచుకునే ముందు, అతని పూర్వాపరాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అతని సర్టిఫికెట్లను పరిశీలించాలి.