How To Choose Best Pension Plan For Retirement :పదవీ విరమణ తరువాత హామీతో కూడిన పింఛన్ ఇచ్చే పథకాలను చాలా బీమా సంస్థలు ఇస్తున్నాయి. అయితే వీటిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దీపం ఉన్నప్పుడే.. చక్కబెట్టుకోవాలి!
Best Immediate Annuity Plan In India 2023 : ఉద్యోగం చేస్తున్నప్పుడే.. మంచి పింఛను పాలసీలను ఎంచుకోవాలి. వాటిలో క్రమం తప్పకుండా మదుపు చేస్తూ ఉండాలి. దీని వల్ల పదవీ విరమణ నాటికి భారీ మొత్తం డబ్బులు చేతికి అందుతాయి. పైగా పెన్షన్ కూడా వస్తుంది. ప్రస్తుతం జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకం అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రభుత్వ పథకాలు కనుక మీకు ఆర్థిక భరోసా ఉంటుంది. వీటితోపాటు అనేక బీమా సంస్థలు అందించే పాలసీలూ ఉన్నాయి. ఇందులో పెట్టుబడి పెట్టిన వెంటనే పింఛను అందించే ఇమ్మీడియట్ యాన్యుటీ పాలసీలు ఉంటాయి. అలాగే నిర్ణీత కాలం పాటు పెట్టుబడిని కొనసాగించి, ఆ తర్వాత పింఛను పొందే డిఫర్డ్ పాలసీలు కూడా ఉంటాయి. వీటిలో మన అవసరానికి సరిపోయే పాలసీలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
అవసరాలకు అనుగుణంగా..
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించడమే పింఛన్ పాలసీల లక్ష్యం. కనుక సాధారణ నగదు అవసరాలకు, మీకు, మీ జీవిత భాగస్వామికి అత్యవసర సమయంలో రక్షణ కల్పించే బీమా అవసరాలకు సరిపడే పాలసీని ఎంచుకోవాలి. జీవిత భాగస్వామి ఆర్థికంగా మీపై ఆధారపడితే.. జాయింట్ లైఫ్ యాన్యుటీ ప్లాన్‌ను పరిశీలించాలి. ఇందులో ప్రాథమిక పాలసీదారుడు మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి పింఛను లభిస్తుంది. ఈ పాలసీలు దంపతులిద్దరికీ పింఛను అందించి.. వారికి ఆర్థిక రక్షణను కల్పిస్తాయి. అయితే అన్ని బీమా సంస్థలు ఇలాంటి ఫెసిలిటీని కల్పించకపోవచ్చు. కనుక పాలసీ తీసుకునేటప్పుడే ఈ విషయాన్ని కచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి కొనుగోలు ధర వెనక్కి ఇచ్చే విధంగానూ యాన్యుటీ పాలసీని తీసుకోవచ్చు. ఇలాంటి పాలసీ తీసుకున్న పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే.. చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని లేదా సగ భాగాన్ని నామినీకి తిరిగి ఇస్తారు.
ప్రతిఫలం?
మీరు పింఛన్ పాలసీ తీసుకునేటప్పుడు.. వివిధ బీమా సంస్థలు ఇచ్చే పాలసీల రాబడులను పోల్చి చూసుకోవాలి. వాటిలో భవిష్యత్ అవసరాలకు అక్కరకు వచ్చే పాలసీలను ఎంచుకోవాలి. మీరు పెట్టే పెట్టుబడి, భవిష్యత్‌లో అందే రాబడిపై ఒక అంచనా వేసుకుంటే.. మీ అవసరాలకు సరిపోయే మొత్తాన్ని ఆర్జించేందుకు ఇంకా ఏమేమి చేయాలో తెలుస్తుంది. నెలవారీ పెట్టుబడులు పెంచడం వల్ల, పదవీ విరమణ నిధిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చు. పెన్షన్ పాలసీలు హామీతో రాబడిని అందిస్తాయి. కనుక, అధిక లాభాల కోసం అవసరమైతే కాస్త నష్టభయం ఉన్న పథకాలనూ ఎంచుకోవచ్చు.