How to choose best health insurance : ఉరుకుల పరుగుల ఈ ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. ఇది కష్ట సమయంలో మనల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది అయితే ఆరోగ్య బీమా తీసుకునే ముందు పలు అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
నిబంధనలు మారుతూ ఉంటాయి!
ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో చాలా సహజంగానే మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలపై మనకు సరైన అవగాహన లేకపోతే.. అవసరమైనప్పుడు పాలసీ ఉన్నా కూడా ఫలితం లేకుండా పోతుంది. అందువల్ల ఆరోగ్య బీమా తీసుకున్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు పరిగణించాల్సిన అంశాలు
Health Insurance room rent limit :
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు గది అద్దె అనేది చాలా కీలకంగా మారుతుంది. ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు కచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీయే గది అద్దె మొత్తం చెల్లించాలే చూసుకోవాలి. లేదంటే మన సొమ్ము గంగపాలైనట్లే.
ఉదాహరణకు మీరు ఒక హెల్త్ పాలసీ తీసుకున్నారనుకుందాం. అందులో గది అద్దె రూ.6 వేలు వరకు మాత్రమే చెల్లించేలా నిబంధన ఉందనుకుందాం. కానీ మీరు చేరిన ఆసుపత్రిలో గది అద్దె రూ.10 వేల వరకు చెల్లించాల్సి వచ్చింది. అంటే మీరు మీ చేతి నుంచి రూ.4వేల రూపాయలు ఆసుపత్రికి చెల్లించాల్సి వస్తుంది. మీరు రూ.4 వేల రూపాయలే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇన్సూరెన్స్ కంపెనీ గది అద్దె ఆధారంగా మిగతా చికిత్స ఖర్చులను లెక్కవేసి, దామాషా ప్రకారం బిల్లులు చెల్లిస్తుంది. అంటే పై ఉదాహరణనే తీసుకుంటే, ఆసుపత్రిలోని గది బిల్లు రూ.6 వేలనే ప్రామాణికంగా తీసుకుని, ఆ మేరకే చికిత్స బిల్లును సర్దుబాటు చేసి క్లెయిమ్ చెల్లిస్తుంది. దీని వల్ల మీరు భారీగా నష్టపోతారు. అందుకే పాలసీ తీసుకున్నప్పుడే గది అద్దెపై ఎలాంటి పరిమితి లేకుండా చూసుకోవాలి. వాస్తవానికి ఇలాంటి పాలసీల ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ అవసరమైనప్పుడు ఇవే మనల్ని ఆదుకుంటాయి.
చికిత్సకు ముందు, తరువాత కూడా..
హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లినంత వరకు అయిన ఖర్చులన్నింటినీ ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. ఇంటికి వెళ్లిన తరువాత కూడా రోగికి అయ్యే ఖర్చులను కొన్ని సార్లు ఆరోగ్య బీమా సంస్థ చెల్లిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పాలసీలు 30 నుంచి 60 రోజుల వరకు, గరిష్ఠంగా 60 నుంచి 180 రోజుల వ్యవధి వరకు ఖర్చులను భరిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవడానికి ప్రయత్నించండి.
ఉపపరిమితులు లేకుండా చూసుకోవాలి
Health Insurance sublimit : ఆరోగ్య బీమా పాలసీల్లో నిర్ణీత వ్యాధులకు మాత్రమే క్లెయిమ్ వర్తిస్తుంది. కొన్ని సార్లు క్లెయిమ్ చేసుకోవడానికి వీలున్నా, దానిపైన కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.
ఉదాహరణకు కంటి శుక్లాల చికిత్సకు రూ.60 వేల వరకే పరిమితి ఉందునుకుందాం. కానీ వాస్తవానికి ఆసుపత్రిలో కంటి శుక్లాల చికిత్సకు రూ.1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యింది. అయినప్పటికీ, ఇన్సూరెన్స్ కంపెనీ మీకు రూ.60 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. ఒకవేళ చికిత్స ఖర్చు రూ.30 వేలు మాత్రమే అయ్యిందనుకుందాం. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆ రూ.30 వేలు మాత్రమే చెల్లిస్తుంది.