How to become Rich : ధనవంతులు కావడం ఎలా? మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు ఈ విషయం చెప్పారా? మనలో చాలా మంది 'పిల్లలకు డబ్బు విషయాలు చెప్పడం మంచిది కాదు' అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం సరికాదు. కచ్చితంగా పిల్లలకు డబ్బు విలువ గురించి చెప్పాలి.
పిల్లలకు ఎంత తొందరగా డబ్బు గురించి తెలియజేస్తే అంత మంచిది. మన భారత దేశంలో సాధారణంగా పెద్ద వారిలో కూడా ఆర్థిక అక్షరాస్యత తక్కువనే చెప్పాలి. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మారిన నేటి పరిస్థితుల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు. పిల్లలకు కచ్చితంగా ఆర్థిక విషయాలు గురించి, డబ్బు సంపాదించే మార్గాల గురించి, మనీ మేనేజ్మెంట్ గురించి తెలియజేయాలి. పర్సనల్ ఫైనాన్సిస్ విషయాలపై తల్లిదండ్రులు కచ్చితంగా తమ పిల్లలతో చర్చించాలని ఈడెల్వైస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా సూచిస్తున్నారు.
పిల్లలకు చెప్పాల్సిన 5 ముఖ్యమైన ఆర్థిక పాఠాలు
రాధికా గుప్తా ట్విట్టర్ వేదికగా మనీ గురించి 5 ముఖ్యమైన విషయాలను షేర్ చేశారు. డబ్బుకు ఉన్న పరిమితులు చెబుతూనే, దానికున్న ప్రాముఖ్యాన్ని ఆమె చాలా స్పష్టంగా వివరించారు. అవి ఆమె మాటల్లోనే..
1. ముఖ్యమైన అవసరాల కోసం మాత్రమే ఖర్చు చేయాలి
డబ్బు చాలా విలువైనది. మీ కలలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి వీలును కల్పిస్తుంది. అది మీ జీవితానికి కావల్సిన చిన్నా, పెద్దా విషయాలను సులభతరం చేస్తుంది. కష్టసమయంలో మీకు ధైర్యాన్ని, ఓదార్పును అందిస్తుంది. మీ ప్రియమైన వారిని ఆనందపరచడానికి ఉపయోగపడుతుంది. కనుక డబ్బు సంపాదించడం, దానిని ఆదా చేయడం ముఖ్యం. మీరు కూడా అనవసరైన ఖర్చులు తగ్గించుకుని, మన నిత్యావసరాలకు, ముఖ్యమైన అవసరాలకు వాటికి మాత్రమే ఖర్చు పెట్టండి.
2. డబ్బుల వర్సెస్ విలువ
డబ్బు మీ విలువను సరితూచలేదు. జీవించడానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు. డబ్బు లేనంత మాత్రాన మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. డబ్బు లేకపోయినంత మాత్రాన మీకు సమాజంలో విలువలేదు అని భ్రమపడవద్దు. ఎందుకంటే డబ్బుకు ఆ సామర్థ్యం ఉంది.
వాస్తవానికి ప్రజలు చూడడానికి చాలా భిన్నంగా మనకు కనిపిస్తారు. వారి బ్యాంకు బ్యాలెన్స్ వారి జీవనశైలి ప్రతిబింబించదు. ఉదాహరణకు.. బాగా డబ్బు ఉన్నవారు కూడా సాధారణంగా కనిపించవచ్చు. సామాన్యులు కూడా పది మందిలో గొప్ప కోసం అప్పులు చేసి, దర్జాగా కనిపిస్తూ ఉంటారు.