How To Add Nominee To EPF Account Online : ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను కలిగి ఉంటారు. అయితే చాలా మంది నామినీని ఏర్పాటు చేసుకునే విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. మనం బ్యాంక్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్, డీమ్యాట్ అకౌంట్స్‌కు ఎలా నామినీని ఏర్పాటు చేసుకుంటామో.. అలానే పీఎఫ్ ఖాతాకు కూడా నామినీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు తప్పనిసరి!
EPF Nominee Mandatory In India : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల పీఎఫ్ ఖాతాలకు నామినీని ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. అయితే ఖాతాదారులు కేవలం తమ కుటుంబ సభ్యులను మాత్రమే నామినీలుగా ఏర్పాటు చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఒక వేళ ఖాతాదారునికి సొంత కుటుంబ సభ్యులు ఎవరూ లేకుంటే.. తను కోరుకున్న వ్యక్తిని నామినీగా ఏర్పాటుచేసుకోవచ్చు. ఒక వేళ ఒకరి కన్నా ఎక్కువ మంది నామినీలను ఏర్పాటు చేసుకుంటే.. ఎవరికి ఎంత శాతం మేరకు బెనిఫిట్స్ లభించాలో కూడా ఖాతాదారుడే నిర్ణయించాల్సి ఉంటుంది.
UAN యాక్టివ్‌గా ఉండాలి!
పీఎఫ్ ఖాతాదారులు కచ్చితంగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) యాక్టివ్‌గా ఉండేటట్లు చేసుకోవాలి. అలాగే తమ ఆధార్ కార్డ్‌కు.. మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోవాలి.
నామినీ ఏర్పాటు వల్ల కలిగే లాభాలు!
EPF Nominee Benefits : పీఎఫ్ ఖాతాకు నామినీని ఏర్పాటు చేసుకుంటే, ఖాతాదారునితో పాటు అతని కుటుంబానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక వేళ దురదృష్టవశాత్తు ఖాతాదారుడు మరణిస్తే.. అతని నామినీ లేదా వారసులు సులువుగా ఆన్లైన్ క్లెయిమ్, ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్, పెన్షన్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ సహా ఇతర ప్రయోజనాలు పొందగలుగుతారు.
నామినీని ఏర్పాటు చేసుకోకపోతే ఏమవుతుంది?
EPF Without Nominee Disadvantages : మీరు కనుక పీఎఫ్ అకౌంట్‌కు నామినీని ఏర్పాటు చేసుకోకపోతే.. కొన్ని కీలకమైన సర్వీసులు నిలిచిపోతాయి. కనీసం మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా వీలుపడదు. ఒక వేళ నామినీని ఏర్పాటు చేసుకోకుండా, ఖాతాదారుడు మరణిస్తే.. అతని పీఎఫ్ సొమ్ము కుటుంబ సభ్యులకు అందడం చాలా కష్టమవుతుంది. పీఎఫ్ బెనిఫిట్స్ పొందడానికి ఖాతాదారుని వారసులు సివిల్ కోర్టుని ఆశ్రయించి, (Succession Certificate) వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తతంగం అంతా పూర్తి చేసిన తరువాత మాత్రమే ఖాతాదారుని వారసులకు పీఎఫ్ డబ్బులు అందుతాయి. కనుక ఇలాంటి సమస్యలు రాకుండా.. ముందుగానే పీఎఫ్ ఖాతాకు నామినీని ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం.
పీఎఫ్ ఖాతాను నామినీని ఏర్పాటు చేయడం ఎలా?
How To Add Nominee To EPF Account Online : మీరు కనుక పీఎఫ్ ఖాతాకు ఇంకా నామినీని ఏర్పాటు చేసుకోకుంటే.. వెంటనే చేసుకోండి. వాస్తవానికి ఆన్లైన్లోనే సులువుగా ఈపీఎఫ్ నామినేషన్/ ఈ-నామినేషన్ పూర్తి చేయవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ https://www.epfindia.gov.in/ ను ఓపెన్ చేయాలి.
- Service మెనూలోని Employees ట్యాబ్‌పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
- Member UAN/ Online Service ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- UAN, పాస్‌వర్డ్‌లతో లాగిన్ కావాలి.
- Manage ట్యాబ్‌పై క్లిక్ చేసి.. e-nomination లింక్‌ను ఓపెన్ చేయాలి.
- మీ ప్రస్తుత, శాశ్వత చిరునామా వివరాలను నమోదు చేయాలి.
- ఫ్యామిలీ డిక్లరేషన్ అప్డేట్ చేసుకోవడం కోసం YES పై క్లిక్ చేయాలి.
- మీ కుటుంబ సభ్యుల వివరాలు సహా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేయాలి. తరువాత..
- మీ పీఎఫ్ అకౌంట్‌కు నామినీని ఏర్పాటు చేసుకోవాలి. (వాస్తవానికి ఒకరి కంటే.. ఎక్కువ నామినీలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.)
- Nomination Detailsపై క్లిక్ చేసి.. మీ నామీనీలకు పీఎఫ్ అమౌంట్లో ఎంతంత షేర్ ఇవ్వాలో స్పష్టంగా డిక్లేర్ చేయాలి. తరువాత Saveపై క్లిక్ చేసి.. ఈపీఎఫ్ నామినేషన్‌ను పూర్తి చేయాలి.
- e-signను సెలెక్ట్ చేసుకుంటే.. మీ రిజిస్టర్ ఫోన్ నంబర్‌కు పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించిన ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే ప్రాసెస్ మొత్తం పూర్తి అవుతుంది.
నోట్ : ఒకసారి ఈ-నామినేషన్ పూర్తి చేసిన తరువాత.. మీరు పనిచేసున్న సంస్థ/ కంపెనీ యాజమాన్యానికి ఎలాంటి పత్రాలను పంపించాల్సిన అవసరం ఉండదు.
Travel Now Pay Later : టూర్ కోసం ప్లాన్ చేస్తున్నారా?.. చేతిలో డబ్బులు లేవా?.. అయితే TNPL లోన్ ట్రై చేయవచ్చు!
BYJUs Lay Off : బైజూస్‌లో 3,500కు పైగా ఉద్యోగాల కోత!.. కారణం అదేనా?