తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.లక్ష లోన్‌పై ఈఎంఐ ఎంత పెరిగే అవకాశం ఉందంటే..? - రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఈ ఎంఐ

అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా తెలిపారు. దీంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా ఈఎంఐ మరింత భారం కానుంది. ఈ నేపథ్యంలో రూ.లక్ష లోన్‌పై ఈఎంఐ ఎంత భారం కానుందో తెలుసుకుందాం. మరోవైపు ఆటోడెబిట్​ లావాదేవీలకు సంబంధించి ఆర్​బీఐ కీలక ప్రకటన చేసింది. ఓటీపీ లేకుండానే పరిమితిని రూ. 5 వేల నుంచి 15 వేలరూపాయలకు పెంచింది.

How Much Your EMI Will Jump On Loans
How Much Your EMI Will Jump On Loans

By

Published : Jun 8, 2022, 1:58 PM IST

RBI Hiked Repo Rate: ధరల పెరుగుదలను అదుపు చేయడమే లక్ష్యంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను పెంచింది. రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.90 శాతానికి చేర్చింది. దీంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. మే నెలలో పెంచిన 40 బేసిస్‌ పాయింట్లు, తాజాగా పెంచిన 50 బేసిస్‌ పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటే ఒక రూ.లక్ష లోన్‌పై ఈఎంఐ ఎంత భారం కానుందో చూద్దాం..

  • మీకు రూ.25 లక్షల గృహరుణం ఉందనుకుందాం. కాలపరిమితి 20 ఏళ్లు, వడ్డీరేటు 7 శాతంగా పరిగణనలోకి తీసుకుందాం. అప్పుడు మీ ఈఎంఐ నెలకు రూ.19,382 నుంచి రూ.20,756కు పెరగనుంది. అంటే అదనంగా మరో రూ.1,374 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి రూ.లక్ష లోన్‌కు అదనంగా నెలకు రూ.55 చెల్లించాల్సి ఉంటుంది.
  • అదే సమయంలో రూ.10 లక్షల వాహన రుణం, 7 ఏళ్ల కాలపరిమితి, 10 శాతం వడ్డీరేటును పరిగణనలోకి తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.16,601 నుంచి రూ.17,070 పెరగనుంది. అంటే అదనంగా రూ.469 చెల్లించాల్సి వస్తుంది.
  • అదే పర్సనల్‌ లోన్ విషయానికి వస్తే.. రూ.6 లక్షల రుణానికి ఐదేళ్ల కాలపరిమితి, 14 శాతం వడ్డీరేటుతో లెక్కిస్తే ఈఎంఐ రూ.281 పెరిగి రూ.13,961 నుంచి రూ.14,242కి చేరనుంది.

ఎఫ్‌డీ మదుపర్లకు మంచి రోజులు!
కేవలం 36 రోజుల వ్యవధిలో ఆర్‌బీఐ రెపోరేటును 0.9 శాతం పెంచింది. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేవారికి శుభవార్త అనే చెప్పాలి. కరోనా సంక్షోభంతో భారీగా పడిపోయిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. 2014 సెప్టెంబరులో ఎఫ్‌డీలపై గరిష్ఠంగా 9 శాతం వడ్డీరేటును ఆఫర్‌ చేసిన ఎస్‌బీఐ కరోనా సంక్షోభంలో దాన్ని 5.4 శాతానికి చేర్చింది. దీంతో ఎఫ్‌డీలపై ఆధారపడే సీనియర్‌ సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఆర్‌బీఐ క్రమంగా వడ్డీరేట్లను పెంచుతుండడంతో తిరిగి ఎఫ్‌డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

ఇకపై ఓటీపీ లేకుండానే రూ.15వేల వరకు.. క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు, యూనిఫైడ్ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లేదా ఇతర ముందస్తు చెల్లింపు (ప్రీపెయిడ్‌) సాధనాల ద్వారా జరిపే ఆటో డెబిట్‌ లావాదేవీలకు సంబంధించి ఆర్​బీఐ కీలక ప్రకటన చేసింది. అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (ఏఎఫ్‌ఏ‌) అవసరం లేని ఆటో డెబిట్ పరిమితిని రూ.5000 నుంచి రూ.15వేలకు పెంచింది. అంటే, ఇకపై వినియోగదారులు ఎలాంటి ఓటీపీ నిబంధన లేకుండానే రూ.15వేల వరకు ఆటో డెబిట్‌గా పెట్టుకోవచ్చు.

ప్రస్తుతం విద్యుత్‌ బిల్లుల దగ్గర నుంచి గ్యాస్‌ బిల్లుల వరకు నెలవారీ ఖర్చులను చెల్లించేందుకు చాలా మంది డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల లేదా యూపీఐల ద్వారా ఆటో డెబిట్‌ పద్ధతిని ఉపయోగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆటో డెబిట్‌ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్‌బీఐ గతేడాది అక్టోబరు నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి తెచ్చింది. వాటి ప్రకారం.. ఆటో డెబిట్‌ తేదీ, డెబిట్ అయ్యే నగదు మొత్తం వంటి వివరాలను కనీసం 24 గంటల ముందే బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారు అనుమతి అనంతరమే ఆటో డెబిట్‌ లావాదేవీని పూర్తి చేయాలి. అంతేగాక, రూ.5000లకు మించిన ఆటో డెబిట్‌ చెల్లింపులకైతే వినియోగదారులు.. వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)వంటి అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను మాన్యువల్‌గా చెప్పాల్సి ఉంటుంది.

అయితే కస్టమర్ల సౌకర్యార్థం ఈ పరిమితిని పెంచినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం వెల్లడించారు. ఇకపై ఆటో డెబిట్‌ చెల్లింపు మొత్తం రూ.15వేలు దాటితేనే కస్టమర్లను బ్యాంకులు అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషేన్ అడగాల్సి ఉంటుంది. రూ.15000 వరకు జరిపే ఆటో డెబిట్ లావాదేవీలకు ఎలాంటి ఓటీపీని ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ వెలువడనుంది. తాజా నిర్ణయంతో కస్టమర్లు ఎలాంటి ఓటీపీ నిబంధన లేకుండానే ఎడ్యుకేషన్‌ ఫీజులు, బీమా ప్రీమియంలు వంటి పెద్ద మొత్తాలను కూడా ఆటో డెబిట్‌ పద్ధతిలో చెల్లించుకోవచ్చు.

ఇవీ చదవండి:ఆర్​బీఐ కీలక నిర్ణయం.. మళ్లీ వడ్డీ రేట్లు పెంపు

భారత వృద్ధి రేటును 7.5 శాతానికి తగ్గించిన ప్రపంచ బ్యాంక్‌

ABOUT THE AUTHOR

...view details