Freshers Health Insurance Benefits : మనిషి జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి తలెత్తవచ్చు. ఏ క్షణంలోనైనా అనారోగ్యం మీ తలుపు తట్టవచ్చు. కొవిడ్ - 19 మహమ్మారి ఈ విషయాన్ని రుజువు చేసింది. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో మీ దగ్గర జాబ్, సేవింగ్స్ లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశముంది.
చాలా మంది వయసులో పెద్దవాళ్లకే అనారోగ్యం వస్తుందని అనుకుంటారు. కానీ ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ అనారోగ్యం బారిన పడుతున్నారు. వయసులో ఉన్నవారికీ ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. వీటన్నింటినీ బట్టి ఆరోగ్య బీమా తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఇది మీ చేతుల్లో డబ్బులు లేనప్పుడు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం చేయడం ప్రారంభించిన వారు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి.
Personal Health Insurance Plans : చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు గ్రూప్ హెల్త్ కవరేజీ అందిస్తున్నాయి. కానీ వ్యక్తిగతంగా పాలసీ తీసుకోవడం ఉత్తమం. దీనికి గల కారణాలు, పాలసీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే.
1. కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది :
కంపెనీలు ఇచ్చే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఆ ఉద్యోగి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అవి కుటుంబం మొత్తానికి వర్తించకపోవచ్చని పర్సనల్ ఫైనాన్స్ నిపుణుడు హేమంత్ రుస్తాగి అన్నారు. ఈ అంశాన్ని విస్మరించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు వస్తాయని అభిప్రాయపడ్డారు.
2. కవరేజీ కొనసాగింపు :
ప్రస్తుతం చాలా కంపెనీలు ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి. కానీ మీరు భవిష్యత్తులో కంపెనీ మారితే అక్కడ ఈ సౌకర్యం ఉండకపోవచ్చు. లేదా ఉద్యోగం పోయినా పాలసీ కోల్పోయే ప్రమాదముంది. అందుకే ఉద్యోగాల మధ్యలో గ్యాప్ ఉన్నా ఆ సమయంలో వ్యక్తిగత బీమా పాలసీ తీసుకుంటే కవరేజీ ఉంటుంది. ఉద్యోగ స్థితితో సంబంధం లేకుండా.. నిరంతర కవరేజీ వర్తిస్తుంది.
3. మెరుగైన కవరేజీ :
కంపెనీలు ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీల్లో కొన్ని పరిమితులు, మినహాయింపులు ఉండవచ్చు. అలాంటప్పుడు కొన్ని ప్రయోజనాల్ని కోల్పోయే ప్రమాదముంది. అదే వ్యక్తిగత పాలసీ తీసుకుంటే ఇవేం ఉండవు. వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యాలు బట్టి మనకు కావాల్సిన కస్టమైజేషన్తో పాలసీ తీసుకునే వెసులుబాటు ఉంది. కవరేజీ ఆప్షన్లు, యాడ్ ఆన్, హామీ మొత్తం తదితరాలు ఎంచుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యక్తిగత కవరేజీ తీసుకుంటే మీకు విస్తృతమైన కవరేజీ పొందే అవకాశముంది.
ఇన్సూరెన్స్ ఎంత తీసుకుంటే ఉత్తమం ?
భవిష్యత్తులో ఎలాంటి వైద్య అవసరాలు వస్తాయో ముందే అంచనా వేయలేం కాబట్టి.. ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటరో కచ్చితంగా చెప్పలేం. కానీ పలువురు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బీమా పాలసీ తీసుకోవాలి. మీరు దీన్ని క్రమంగా మీ అవసరాలు, ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి పెంచుకుంటూ వెళ్లాలి. పాలసీ తీసుకునే ముందు ప్రస్తుత ఆరోగ్య స్థితి గతులు, జీవన విధానం, మెడికల్ అవసరాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్రను గమనించుకోవాలి.
ఎలాంటి పాలసీ తీసుకోవాలి ?
మీకు, మీ తల్లిదండ్రులకు వేర్వేరుగా పాలసీలు తీసుకుంటే ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వారి ఆరోగ్య అవసరాలు, లభించే మొత్తం తదితర వివరాలు దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలని చెబుతున్నారు. వయసు, నిర్ధిష్ట అనారోగ్యాలు ఎక్కువ క్లెయిమ్ లకు దారితీయవచ్చు. కాబట్టి ప్రత్యేక పాలసీ తీసుకోవాలి. మరో కారణం ఏంటంటే.. ఫ్రెషర్ లకు వర్తించే కవరేజీ ప్రయోజనాలు తల్లిదండ్రులకు వర్తించకపోవడం. కాబట్టి భవిష్యత్తులో మెడికల్ ఎమర్జెన్సీలు భారం కాకుండా ఉండేందుకు ఆరోగ్య బీమా అనేది ఒక ముఖ్య సాధనం. వాటిని మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు అందించండి.!